పుదుచ్చేరిలో బీజేపీ కూటమి గెలిచింది. బీజేపీ కూటమి అంటే… అప్పుడెప్పుడో కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్.ఆర్. కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీజేపీ కూటమి కలిసి పోటీ చేశాయి. రంగస్వామిని మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ గెలుపుతో పాటు రంగస్వామి గెలుపు కూడా ముఖ్యం కాబట్టి… ఆ బాధ్యతను… వైసీపీకి అప్పగించారు. ఇది కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా… తెర వెనుక రాజకీయంలో ఇదే నిజం. వైసీపీ వెంటనే.. రంగంలోకి దిగి.. యానాం నుంచి వరుసగా కాంగ్రెస్ తరపున గెలుస్తూ వస్తున్న మల్లాడి కృష్ణారావుతో టచ్లోకి వెళ్లింది.
జగన్ ను విపరీతంగా అభిమానించే ఆయన.. ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి… రాజకీయాల నుంచి విరమించుకున్నట్లుగా ప్రకటించారు. కానీ తనకు బదులుగా రంగస్వామిని నిలపెట్టాలంటూ… మాజీ ముఖ్యమంత్రికి మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. రంగస్వామి బరిలో నిలవడంతో పోటీ లేకుండా పోయింది… అని అనుకున్నారు. కాంగ్రెస్కు అభ్యర్థి లేరు. అయితే.. రంగస్వామి గెలవలేదు. ఓడిపోయారు. గొల్లపల్లి అశోక్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రంగస్వామి విజయాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఆ పార్టీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా నేతలంతా యానాంలో మకాం వేసి గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆ పార్టీ పెద్దలు కూడా… యానాం ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అక్కడ ప్రత్యర్థి ఎవరూ లేకపోవడం.. మల్లాడి కృష్ణారావు సపోర్ట్ చేయడంతో రంగస్వామి విజయం ఖాయమని అనుకున్నారు. కానీ… ముఫ్పైఏళ్ల యువకుడు.. అశోక్.. ఓ వైపు.. మల్లాడి కృష్ణారావును..మరోవైపు వైసీపీ బలగాన్ని ఎదుర్కొని విజయం సాధించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించారు.