రాజకీయ వ్యూహకర్త గా ఇక ఏ పార్టీకి పని చేయబోనని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బెంగాల్లో మమతా బెనర్జీ… తమిళనాడులో స్టాలిన్ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహాకర్తగా పని చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. ప్రధానంగా ఆయన బెంగాల్ అంశంలో బీజేపీ చేస్తున్న ప్రచారానికి గట్టి కౌంటర్లు ఇచ్చారు. బీజేపీది ఆయన అనుకూల మీడియాలో మాత్రమే గెలుస్తుందనే ప్రచారం మాత్రమేనని.. ప్రజల్లో మాత్రం దీదీనే గెలుస్తుందని చెప్పేవారు. బీజేపీకి వంద కంటే ఎక్కువ సీట్లు వస్తే.. తాను సోషల్ మీడియాను వదిలేస్తానని సవాల్ చేశారు. ఆయన జోస్యం చెప్పినట్లుగానే బీజేపీ వంద సీట్ల దరి దాపుల్లోకి కూడా రాలేదు.
దీంతో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై మరింత గురి కుదిరింది. అయితే అనూహ్యంగా తాను స్ట్రాటజిస్ట్‌గా విరమిస్తున్నానని ఆయన ప్రకటించుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన సేవలు పొందాలని వైసీపీ భావిస్తోంది. ఇతర పార్టీలు కూడా క్యూలో ఉన్నాయి. పీకే.. గతంలోనే … స్ట్రాటజిస్ట్ పనులు వదిలేసి రాజకీయాల్లోకి పోయారు. ఆయన టీమ్‌కు పనులు అప్పగించారు. వెళ్లి తన స్వరాష్ట్రమైన బీహార్‌లో జేడీయూ పార్టీలో చేరారు. బీహార్ సీఎం నితీష్ తన వారసుడిగా ప్రశాంత్ కిషోర్ ను ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆయనకు రాజకీయాలంటే ఏమిటో అర్థమైంది.
వ్యూహకర్త పదవికి.. రాజకీయాలు చేయడానికి ఉన్న తేడా అర్థమైంది. వెంటనే.. ఆయన జేడీయూ నుంచి యటకు వచ్చి… మళ్లీ స్ట్రాటజిస్ట్‌గా పని చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన ఇమేజ్ మరింత పెరగడంతో.. ఈ సారి బీహార్‌లో సొంత పార్టీ పెట్టుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ.. పీకే… స్ట్రాటజిస్ట్‌గా పని చేయడం మానేస్తున్నట్లుగా ప్రకటించారు.