ట్రంప్ , ఇజ్రాయెల్ చేసిన తొందరపాటు పనితో మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ప్రారంభమయింది. ఇరాన్ తన క్షిపణి , డ్రోన్ బలగాలతో గల్ఫ్ దేశాలను వణికిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడులకు ప్రతిచర్యగా, ఇరాన్ గ్రేట్ రివెంజ్ పేరుతో గల్ఫ్ రీజియన్ అంతటా ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే వందలాది బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ గడ్డపై నుంచి ప్రయోగించింది. మొత్తం పశ్చిమ ఆసియా ఆందోళనలో మునిగిపోయింది.
ఖతార్‌లోని అల్-ఉదైద్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదవ నౌకాదళం ప్రధాన కార్యాలయం, కువైట్, యూఏఈలలోని కీలక సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. అమెరికాకు సహకరిస్తున్న ఏ దేశానికైనా ఇదే గతి పడుతుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడంతో గల్ఫ్ దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. తమ భూభాగాన్ని అమెరికా దాడులకు వేదికగా ఉపయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న ఇరాన్ హెచ్చరికలు ఈ దేశాలను ఇరకాటంలో పడేశాయి.
సౌదీ అరేబియా, యూఏఈ , జోర్డాన్ వంటి దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసి, అత్యున్నత స్థాయి భద్రతను ప్రకటించాయి. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కార్యకలాపాలను నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్త విమాన ప్రయాణాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ కేవలం సైనిక స్థావరాలపైనే కాకుండా, అంతర్జాతీయ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ని కూడా తన పట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ఒక అగ్నిపర్వతంలా మారింది. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై మరింత శక్తివంతమైన దాడులకు సిద్ధమవుతుండటంతో, ఇది మల్టీ-ఫ్రంట్ యుద్ధంగా మారి ఇతర గల్ఫ్ దేశాలను కూడా ఈ రొంపిలోకి లాగుతోంది.
