‘అల్లుడు శీను’తో ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమా హిట్టు. ఆ తరవాత యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు. బెల్లంకొండ అనగానే హిందీ డబ్బింగ్ రైట్స్ హాట్ కేకులా అమ్ముడుపోతుంది. చాలామంది సీనియర్ హీరోలకంటే.. బెల్లంకొండకు హిందీ బెల్ట్ లో మార్కెట్ బాగుంటుంది. అందుకే స్ట్రయిట్ గా ఓ హిందీ సినిమా చేశాడు. కానీ కలసి రాలేదు. ఆ తరవాత అనుకోకుండా గ్యాప్ వచ్చింది. నాలుగేళ్ల పాటు తెలుగులో కనిపించలేదు. అయితే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘భైరవం’, ‘కిష్కింద పురి’, ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ ఇవన్నీ ఒకేసారి పట్టాలెక్కించాడు. వీటిలో ముందుగా ‘భైవరం’ వస్తోంది. ఈనెల 30న ఈ సినిమా విడుదల.
సాధారణంగా ఓ హీరోకి నాలుగేళ్ల గ్యాప్ తరవాత సినిమా చేస్తున్నాడు, అది కూడా రీమేక్ సినిమా అంటే బిజినెస్ వర్గాల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. పైగా ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కూడా చాలా డల్ గా ఉంది. కానీ ‘భైరవం’ మాత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసుకొంది. తెలుగు శాటిలైట్ మినహా, మిగిలిన హక్కులన్నీ రూ.32 కోట్లకు అమ్ముడయ్యాయి. బెల్లంకొండ కెరీర్లో మంచి రేటు ఇది. ఓరకంగా సినిమా విడుదలకు ముందే గట్టున పడినట్టైంది.
ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నాడు బెల్లంకొండ. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొంటున్నాయి. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని, కొన్ని షాట్స్.. విజువల్స్ లో బెల్లంకొండ కొత్తగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. బెల్లంకొండని ఇప్పటి వరకూ యాక్షన్ హీరోగానే చూశాం. ఇక మీదట ఆ ఇమేజ్ మారే అవకాశం ఉంది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కూడా నిలబడితే తప్పకుండా ఫామ్ లో వచ్చేసినట్టే. ఎందుకంటే చేతిలో ఉన్న మూడు సినిమాలు కూడా దేనికవే విభిన్నం. ముఖ్యంగా ‘హైందవ’ పై కూడా బెల్లంకొండ భారీ నమ్మకంతో ఉన్నాడు. దీన్ని పాన్ ఇండియా సినిమా రేంజ్లో తీర్చిదిద్దుతున్నారు. ఒక రకంగా ఇది బెల్లంకొండ డ్రీమ్ ప్రాజెక్ట్. ‘భైరవం’ హిట్ అయితే మిగిలిన సినిమాలకు మరింత బూస్టప్ రావడం ఖాయం.