దేశానికి ఉప-ప్రధాని కావలెను…

చాలాకాలం తర్వాత (13ఏళ్లకు) ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఉప -ప్రధానమంత్రి అవసరమేమోనన్న ఆలోచనలు మరోసారి వినవస్తున్నాయి. ఈ ఆలోచనలు రావడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో బిజిబిజీగా ఉంటూ కీలకమైన పాలనాంశాలపై ఎక్కువ సమయం కేటాయించకపోవడమే. పైగా మోదీకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ప్రతిపనిలోనూ తన జోక్యం ఉండాలనుకోవడం. ఈ పోకడే ఆయనలోపల `నియంతృత్వ మనిషి’ దాగున్నాడన్న సందేహాలు సొంత పార్టీలోని వాళ్లకే కలుగుతున్నాయి. బిహార్ ఎన్నికల ప్రచారసభల కోసం ఆయన చాలా సమయం వెచ్చించారు. అలాగే, విదేశీ పర్యటనల కోసమూ అంతేసమయం వెచ్చిస్తున్నారు. దీంతో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, అత్యవసరంగా మంత్రులతో చర్చించాలన్నా ఢిల్లీలో మనిషి అందుబాటులో ఉండటంలేదు. మొన్నటి బిహార్ ఫలితాలతో ఈ లోపం బహిర్గతమైంది. పాలన సవ్యంగా సాగుతున్నంతవరకూ అంతా బాగానే ఉంటుంది. కానీ అది గాడితప్పినప్పుడే ప్రత్యామ్నాయ ఆలోచనలు మొగ్గతొడుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే.

ఉప-ప్రధాని అవసరం ఉన్నదా?

ప్రధాని మోదీకి కుడిభుజంగాఉండే వ్యక్తిని ఉప-ప్రధానిగా నియమిస్తే నరేంద్ర మోదీకి పనిఒత్తిడి తగ్గుతుంది. బిజెపీ పార్టీ మార్గదర్శిక మండలిలోని సీనియర్లు ఇలాంటి ప్రతిపాదన చేసే అవకాశాలున్నాయి. ఈ సూచనను మోదీ అంగీకరిస్తారా? లేక పెద్దల ఆలోచనలను చెత్తబుట్టపాలు చేస్తారా అన్నది వేరే విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉప-ప్రధానిగా ఒకరిని నియమిస్తే బాగుంటుందన్న ఆలోచనైతే మొగ్గతొడిగిందని మాత్రం చెప్పవచ్చు.
బిహార్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరపడానికి ముందే పార్టీ మార్గదర్శక మండలి కీలకమైన సూచన చేయవచ్చు. పైగా మోదీ పాలనపై ముసురుకుంటున్న విమర్శల తీవ్రతను చప్పబరచడానికి ఇదో వ్యూహంగా ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రధాని తనకు కుడిభుజంగా ఒక సీనియర్ ని ఉప-ప్రధానిగా నియమించుకుంటే పరిస్థితులు చక్కబడతాయన్న భావన ప్రజల నుంచి కూడా వినబడుతోంది.

ఉప ప్రధాని – హక్కులు

మనదేశ రాజ్యాంగంలో ఉప-ప్రధాని పదవి నియామకానికి ఎలాంటి నిబంధన లేదు. కాబట్టి ఉప- ప్రధాన మంత్రిని ఖచ్చితంగా నియమించాల్సిన అవసరం లేదు. కాకపోతే పాలనాపరమైన ఒత్తిడి, లేదా రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఒత్తిళ్ల కారణంగా ప్రధానమంత్రి తనకు అన్నివిధాలా నచ్చిన వ్యక్తి (ఇతను సహజంగా సీనియర్ అయిఉంటాడు)ని ఉప- ప్రధానిగా నియమించుకుంటారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి , మిగతా భావసారూప్యమున్న పార్టీల్లోని ఒకరిని ఉప- ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంటుంది. పూర్తి మెజారిటీతో ఒక పార్టీ నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పరచినప్పుడు సైతం, బాధ్యతలను పంచుకునే వ్యక్తి ఒకరుంటే బాగుంటుందని ప్రధానమంత్రి భావించడం, ఉప- ప్రధానమంత్రిని నియమించుకోవడమన్నది చాలా అరుదైన విషయం. తొలి ప్రధాని నెహ్రూ హయాం అలా జరిగింది.

ఉప- ప్రధానమంత్రికి రాజ్యాంగపరంగా ఎలాంటి ప్రత్యేక హక్కులుండవు. రాజ్యాంగాన్ని తయారుచేసేటప్పుడు ఉప- ప్రధానమంత్రి అవసరం ఉండదని బహుశా రాజ్యాంగ నిర్మాతలు భావించి ఉండవచ్చు. పైగా ఉప ప్రధానమంత్రి పదవి ఏర్పాటు వల్ల అదనపు ఖర్చని కూడా అనుకుని ఉండవచ్చు. పైగా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కు ప్రత్యేకంగా ఆఫీసంటూ ఉండదు. దీంతో ఒకవేళ ఫలనా వ్యక్తిని ఉప- ప్రధానిగా నియమించాలనుకున్నప్పుడు, ఎలాంటి రాజ్యాంగపరమైన లాంఛనాలు ఉండవు. అంటే, ఉప ప్రధానిగా నియమితులయ్యే వ్యక్తి ప్రమాణస్వీకారం చేయాల్సిన అవసరమేలేదు. లోక్ సభలో కూర్చోవడానికి ఉప ప్రధానికి నిర్ధుష్టమైన సీటు ఉండదు. అందుకే మంత్రివర్గంలోని ఒక సీనియర్ ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ బాధ్యతలు అప్పగిస్తే, సభలో క్యాబినెట్ మంత్రి స్థానమే డిపీఎం స్థానమవుతుంది. అందుకే సాధారణంగా, తన మంత్రిమండలిలోని కీలకశాఖలు (ఆర్థిక, హోంశాఖలు)నిర్వహించే సీనియర్ మంత్రులకే ఈ హోదా కట్టబెట్టడం ఆనవాయితీగా మారింది.

ఉప ప్రధానికి ప్రత్యేకమైన అధికారాలు లేకపోయినప్పటికీ, ప్రధానమంత్రి ఆరోగ్యం సరిగాలేనప్పుడుగానీ, లేదా ప్రధాని విదేశాలకు వెళ్ళినప్పుడుగానీ, లేదా ప్రధాని ఆకస్మికంగా మరణించినప్పుడుగానీ ప్రధానియెక్క బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంటుంది. మామూలుగా ఉన్న ఆనవాయితీ ఏమిటంటే, ప్రధాని అందుబాటులో లేనప్పుడు ఉప-ప్రధాని మంత్రిమండలి సమావేశాలు నిర్వహిస్తుంటారు . అయితే, ఇవన్నీ ముందే చెప్పినట్లు రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు కావు. అసలు మనదేశంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నియామకం దేశ రాజకీయాలనుంచి పుట్టుకొచ్చిందేగానీ, పాలనాపరంగా అధికారికంగా ఏర్పాటుచేసినది కానేకాదు. అలా జరగాలంటే, రాజ్యాంగసవరణ చేయాల్సి ఉంటుంది. మరో విషయమేమంటే, చాలా సందర్భాల్లో ప్రధానికి ఈ ఉప పదవి ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే ఇలాంటి ప్రయత్నాలు మొగ్గదశలోనే ఆవిరైపోతుంటాయి.

ఇతర దేశాల్లో ఉప ప్రధానులు

మనదేశం సంగతి ఇలా ఉంటే, అనేక దేశాల్లో ఉప ప్రధాని నియామకం చాలా కీలకమైనదిగానే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, ఇజ్రేల్, ఐర్లండ్, మలేషియా, న్యూజిలాండ్, పోలండ్, సింగపూర్, స్వీడన్ , ఉత్తర ఐర్లండ్, స్కాట్ లాండ్- వేల్స్ లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నియామకాలున్నాయి. ఇక బ్రిటన్ లో డిప్యూటీ మినిస్టర్ ని షాడో ప్రైమ్ మినిస్టర్ అని పిలుస్తుంటారు. కాగా, జర్మనీలో అసోసియేట్ మినిస్టర్ ఆఫ్ ఛాన్సలర్ ని డిప్యూటీ ఛాన్సలర్ అని పిలుస్తుంటారు. ఈ దేశాలన్నింటిలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కి కొన్ని విధులు, అదనపు బాధ్యతలున్నాయి. మనదేశంలో ఏ రకమైన అధికారాలూ, బాధ్యతలు లేనప్పుడు ఉప- ప్రధానమంత్రిని ఎందుకు ఏర్పాటు చేయాలన్న ప్రశ్న తలెత్తకమానదు.

దేశంలో ఉప- ప్రధానులు వీరే…

మనదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పాలనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప- ప్రధానమంత్రిగా ఉన్నారు. పటేల్ అత్యంత సమర్థవంతమైన హోంశాఖ మంత్రిగా కూడా పేరుతెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 1967-69 మధ్యకాలంలో మురార్జీదేశాయ్ ఉప ప్రధానిగా వ్యవహరించారు. అటుపైన మురార్జీ దేశాయ్ ప్రధానిగా ఎదిగినప్పుడు 1979 ప్రాంతంలో చరణ్ సింగ్, జగ్జీవన్ రాం సంయుక్తంగా ఉప ప్రధాని బాధ్యతలు తీసుకున్నారు. ఇక 1979-80లో చవాన్ ఈ పదవిలో ఉన్నారు. 1989-90లో వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేవీలాల్ ఉప ప్రధానిగా ఉన్నారు. 1990-91లో కూడా దేవీలాల్ ఇదే పదవికి మరోసారి నియమించబడ్డారు. ఇక చివరిగా 2002 జూన్ 19న అద్వానీకి ఉప- ప్రధాని పదవి కట్టబెట్టారు. ఉప- ప్రధానులుగా నియమితులైన వారిలో అద్వానీ ఏడవ వ్యక్తి. అదే చివరిసారికూడా. ఆ తర్వాత ప్రధానమంత్రి తనకు ఉప ప్రధాని కావాలని అనుకోలేదు. అలాంటి ఆలోచనలు మొగ్గతొడగనూలేదు.

ఇప్పుడు అవసరం ఉన్నదా ?

పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఉప ప్రధాని అవసరం గురించి మాట్లాడుకోవాల్సి వస్తున్నది. కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసం ఇంతవరకూ ఉప ప్రధానమంత్రుల నియామకం జరిగినమాట నిజమే. అలాగే, ఇలాంటి అనవసరపు, అధికార రహిత పదవిని నిషేధించాలన్న అభిప్రాయం ఉన్నమాట కూడా నిజమే. కానీ, మోదీని ఇప్పుడు సరైన దారికి తీసుకురావడానికీ, ఆయనకు పని ఒత్తిడి తగ్గించడానికి పార్టీ మార్గదర్శక మండలి – ఉప- ప్రధానమంత్రి నియమించాలంటూ సలహా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ విదేశీపర్యటనలు తగ్గించుకుని ఇకనుంచైనా పాలనపై శ్రద్ధపెట్టాలని ఒక పక్క కాంగ్రెస్ నాయకులు (ముఖ్యంగా రాహుల్ గాంధీ) విమర్శిస్తుండటం, మరోవైపున మోదీకి ఒత్తిడి తగ్గించాలన్న నెపంతోనైనా అధికారపార్టీని సరైన దిశగా పరిగెత్తించడానికి సీనియర్లు ప్రయత్నిస్తుండటంతో ఉప-ప్రధాని అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే మోదీకి ఇష్టంలేకపోతే ఇలాంటి ఆలోచనలు ఏమాత్రం ముందుకుసాగదు. మరి పిల్లిమెడలో గంట కట్టే బాధ్యత ఎవరిది? అందరి చూపూ అద్వానీమీదనే.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close