2019 ఎన్నికలలో ఖచ్చితంగా పోటీకి దిగుతానన్న పవన్

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఈ ఉదయం దాదాపు రెండు గంటలపాటు భేటీ అయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను రాలేకపోయానని, ముఖ్యమంత్రికి శుభాకాంక్షలను తెలిపేందుకే వచ్చానని అన్నారు. రాజధానికోసం భూమిని బలవంతంగా తీసుకోవద్దని, ఏకాభిప్రాయంతో తీసుకోవాలని తాను చేసిన సూచనలను ముఖ్యమంత్రి మన్నించినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపానని వెల్లడించారు. ముఖ్యంగా బాక్సైట్ గనుల తవ్వకాల సమస్య గురించి ప్రస్తావించానని చెప్పారు. గిరిజనులను అక్కడనుంచి తరలించొద్దని, సంబంధిత వర్గాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోబోమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. దృష్టంతా రాజధాని నిర్మాణంమీదే పెడుతున్నారని, మిగిలిన ప్రాంతాల ప్రజలందరూ అసంతృప్తితో, అపోహలతో, భయాలతో ఉన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. రాజధానిలో పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళానని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి కూడా చర్చించినట్లు తెలిపారు.

జనసేనను మరింత విస్తరించటానికి తనకు ఆర్థిక స్థోమత లేదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రస్తావన అసలు రాలేదని అన్నారు. కేంద్రం హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది కాబట్టి వేచి చూద్దామని అన్నారు. చేయనంటే తన రియాక్షన్ వేరుగా ఉంటుందని, చేస్తానన్నారు కాబట్టి వేచి చూడాలని చెప్పారు.. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్‌లలో ఏదో ఒకదానిపై నిర్ణయం వచ్చాకే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రధానిని కలుస్తారా అని అడిగిన ప్రశ్నకు, ముఖ్యమంత్రి కంటే తాను పెద్ద స్థాయి వ్యక్తిని కానని అన్నారు. ప్రజలకు చెడు జరిగినా, అన్యాయం జరిగినా ఊరుకోనని చెప్పారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తే ప్రయోజనం ఉండదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే బీజేపీ దెబ్బతినటం ఖాయమని చెప్పారు. ఏ సమస్యనైనా చర్చలద్వారా పరిష్కరించుకుంటేనే బాగుంటుందని అన్నారు. రాజధానిలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళానని, ఎవరినుంచీ బలవంతంగా భూములు తీసుకోబోమని సీఎం చెప్పారని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com