జగన్ అమెరికా పర్యటన వ్యక్తిగతమా..? అధికారికమా..?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి .. రెండో విదేశీ పర్యనటకు వెళ్తున్నారు. మొదటి సారిగా.. ఆయన ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. రెండో సారి అమెరికా వెళ్తున్నారు. మొదటి సారి పూర్తి వ్యక్తిగత పర్యటన అని.. భద్రతా ఖర్చులకు మాత్రమే.. ప్రభుత్వం వద్ద నుంచి రూ. పాతిక లక్షలు నిధులు విడుదల చేసుకున్నారు. అమెరికా పర్యటన విషయంలో మాత్రం.. ఈ ఖర్చులు.. వ్యవహారాలు.. మొత్తం గోప్యంగా సాగుతున్నాయి. నిన్నామొన్నటి వరకూ.. ఇది పూర్తిగా.. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటనగానే… ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ రాత్రికి రాత్రి.. అధికారిక పర్యటన అన్నట్లుగా.. చెబుతున్నారు. ఆయనతో పాటు అధికారులు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారని చెబుతున్నారు. దీంతో.. సీఎం టూర్ విషయంలో ఇంత సమన్వయ లోపం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది.

వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అమెరికాకు పయనమవడానికి ప్రధాన కారణం… రెండో కుమార్తెను.. అక్కడ ఓ యూనివర్శిటీలో చేర్పించడం. అమెరికాలో చదువుకునేందుకు.. ఓ యూనివర్శిటీలో.. జగన్ రెండో కుమార్తె సీటు సాధించారు. దాంతో.. కుటుంబసమేతంగా వెళ్లి చేర్పించి రావాలని జగన్ నిర్ణయించుకున్నారు. సీఎంగా ఎన్నికయిన తర్వాత తొలి సారి అమెరికా వెళ్తున్నందున.. అమెరికాలోని వైసీపీ అభిమానులు.. ఓ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపించారు. అది కూడా… పూర్తిగా… ప్రైవేటు కార్యక్రమం. వైసీపీ అభిమానుల కోసం.. వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమం. దానికి జగన్ హాజరవుతారు. జగన్ అమెరికా పర్యటన గురించి… మొదట బయటకు తెలిసినప్పుడు… ఈ సమావేశం గురించి మాత్రమే మొదటగా బయటకు తెలిపారు. కుమార్తె అడ్మిషన్ గురించి చెప్పలేదు.

అయితే.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన అధికారికంగా మారిపోయిందని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో.. సీఎం హోదాలో..సమావేశాలు, సమీక్షల్లో అత్యంత బిజీగా గడుపుతారని చెబుతున్నారు. ఈ రోజున అమెరికాకు బయలుదేరే సీఎం జగన్… 24 వరకు అగ్రరాజ్యంలో ఉంటారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు.. ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో సమావేశం అవుతారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించారు. జగన్‌తో పాటు అమెరికా వెళ్లే బృందంలో కొత్తగా పలువురు నేతలు చేరారు. కొసమెరుపేమిటంటే… అధికారిక పర్యటనగా రూపాంతరం చెందినప్పటికీ.,. జగన్మోహన్ రెడ్డి… సొంత ఖర్చులతోనే వెళ్తున్నారు. భద్రతా ఖర్చులు మాత్రమే.. ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇవి ఎంత అని డౌట్ తెచ్చుకోకండి.. ఇంకా జీవో బయట పెట్టలేదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com