2014లో అధికారంలోకి వచ్చిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా ఒక సిద్ధాంతాన్ని మాత్రం చాలా గట్టిగా ఫాలో అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ సమాధానాలు చెప్పకూడదు. మేం చేస్తున్న పనులను, తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, అవినీతిపరులు, అరాచకవాదులే. ఆ ప్రశ్నించిన వాళ్ళు సామాన్య ప్రజలైనా సరే అవినీతిపరులు, అరాచకవాదులు అన్న ముద్ర వేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కాంగ్రెస్ పార్టీతో సహా విమర్శిస్తున్న అన్ని పార్టీలను మీ హయాంలో చేసిన కుంభకోణాల గురించి చెప్పండి అని ఎదురుదాడి చేస్తున్నారు. నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు, కెసీఆర్‌లు అందరిదీ ఇదే స్టైల్. ఇలాంటివి ఆ నాయకుల భక్తులకు పరమానందాన్ని కలిగిస్తాయేమో కానీ సామాన్య ప్రజలకు మాత్రం పైసా ఉపయోగం ఉండదు. పైగా ఇంతకుముందు వాళ్ళు చేసిన స్కాంల గురించి విమర్శలు చేస్తూ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కుంభకోణాల గురించి విమర్శలు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీతో సహా ఇంతుకుముందు అధికారంలో ఉన్న అందరూ కూడా కుంభకోణాలు చేశారు. అవినీతి కార్యకలాపాలు, అసమర్థ పాలనతో ప్రజలకు నరకం చూపించారు. వాళ్ళ పాలన అంత దరిద్రంగా తగలడింది కాబట్టే ప్రజలు మోడీ, చంద్రబాబు, కెసీఆర్‌లకు పట్టంగట్టారు. ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది. సోనియాగాంధీతో సహా అవినీతికి పాల్పడ్డ అందరు నాయకుల అవినీతిని నిరూపించి వాళ్ళను జైలుకు పంపే అధికారం ఇప్పుడు మీకు ఉంది. ప్రపంచం మొత్తం మీద కూడా జగన్‌ని మించిన అవినీతిపరుడు లేడు అని నినదించిన చంద్రబాబుకు కూడా ఆ ఛాన్స్ ఉంది. అధికారంలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నాయి. ఇప్పుడు మోడీ, చంద్రబాబు, కెసీఆర్ చేస్తున్న కుంభకోణాల గురించి విమర్శలు చేసినప్పుడు ఎదురుదాడికి దిగడానికి, ప్రతిపక్షాలను డిఫెన్స్‌లో పడేయడానికి మాత్రం సోనియా అండ్ కో అవినీతి, జగన్ అవినీతి బాగోతాలను అడ్డుపెట్టకుంటున్నారు కానీ వాళ్ళ పైన ఉన్న కేసులను నిరూపించాలి. వాళ్ళను శిక్షించాలి అన్న చిత్తశుద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో లేనప్పుడు చేసిన విమర్శలు, కబుర్లనే ఇప్పుడు కూడా చెప్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకు? నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే శిక్ష పడేలా చెయ్యండి. అలా జరగకపోతే మాత్రం ఆ పార్టీ…ఈ పార్టీ అన్న తేడా లేకుండా మీరంతా అవినీతిపరులే అన్న అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ప్రజలను మాయ చేస్తూ అందరూ కుమ్మక్కయి ప్రజాసొమ్మును దోచుకుంటున్నారని నమ్మాల్సి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్ననాయకులపైన మీరు చేసిన విమర్శలన్నీ కూడా ఉత్త కహానీలే అని అయినా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది.
టిడిపి, బిజెపిల సంకీర్ణ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో అగ్రస్థానంలో నిలిచింది. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు 450 కోట్ల స్కాంలో ఇరుక్కున్నాడు. నోట్ల రద్దు దాదాపు ఐదు లక్షల కోట్ల స్కాం అని మీ మద్ధతుదారుడు రాందేవ్ బాబా ఆరోపిస్తున్నారు. మామూలుగా అయితే రాందేవ్ బాబాకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ 2014 ఎన్నికల సమయంలో మోడీ, చంద్రబాబులను సమర్థించినప్పుడు బాబాను మేధావిని చేసింది బాబు, మోడీలే కాబట్టి ఇప్పుడు ఆ మేధావి విమర్శలకు సమాధానం చెప్పాల్సింది కూడా వాళ్ళే. అలాగే సుబ్రణ్యస్వామి కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. అధికారంలో ఉన్నవాళ్ళెవ్వరైనా సరే చేతనైతే అంతకుముందు కాలంలో అవినీతి చేసినవాళ్ళకు శిక్షలు పడేలా చేయండి. అది చేతకాకపోతే ఇఫ్పుుడు మీపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పండి. ఎంతసేపూ నాయకులందరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటే ప్రజలకు ఒరిగేదేం ఉంటుంది.