2026 టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్‌కు తమ జట్టును పంపే విషయంలో బంగ్లాదేశ్ తీసుకున్న బహిష్కరణ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. పాకిస్థాన్ కూడా అదే బాటలో నడుస్తుందా అనే చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఐసీసీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అన్యాయంగా వ్యవహరించిందని, ఒక దేశానికి ఒకలా.. మరో దేశానికి ఇంకోలా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని ఆయన మండిపడ్డారు.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనే అంశం పూర్తిగా తమ ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని నఖ్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం పాక్ ప్రధాని దేశంలో లేరని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాము ఐసీసీ ఆదేశాల కంటే తమ దేశ ప్రభుత్వ నిర్ణయాలకే కట్టుబడి ఉంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే, ప్రపంచకప్ నుంచి తప్పుకోవడానికి కూడా వెనకాడబోమని, తమ వద్ద ప్లాన్ ఏ, బి, సి, డి వంటి ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయని నఖ్వీ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ కోరిన విధంగా హైబ్రిడ్ మోడల్‌ను వర్తింపజేయకపోవడాన్ని నఖ్వీ తప్పుబట్టారు. పాకిస్థాన్, భారత్ విషయంలో ఒకలాంటి నిబంధనలు ఉంటే, బంగ్లాదేశ్‌కు కూడా అదే వర్తింపజేయాలని ఆయన వాదించారు. ఒక దేశం మరొక దేశంపై పెత్తనం చలాయించడం లేదా ఆదేశించడం వంటివి తాము అంగీకరించబోమని, భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బంగ్లాదేశ్‌కు న్యాయం జరగకపోతే పాకిస్థాన్ తనదైన శైలిలో స్పందిస్తుందని హెచ్చరించారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే… పాక్ లీగ్ మ్యాచలన్నింటినీ కొలంబోలో ఉండేలా షెడ్యూల్ చేశారు.
