హిందీ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటల్లో విపరీతార్థాలు వెదుక్కున్న వ్యతిరేకులు అలుపు లేకుండా తమ వాదనలు వినిపించడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో తీరిక లేకుండా కథలు, కాకరకాయలు వండారు. హిందీ పెద్దమ్మ అనడం.. రాజభాష అనడం పై విపరీత అర్థాలు తీశారు. పవన్ కల్యాణ్ తన అభిప్రాయం చెప్పారు. హిందీ భాష పేరుతో రాజకీయం చేయడాన్ని వ్యతిరేకించారు. ఇతర భాషల్ని నేర్చుకుంటున్నప్పుడు హిందీపైనే ఎందుకు ద్వేషం పెంచుతున్నారన్న అంశాన్ని బలంగా చెప్పారు. హిందీ నేర్చుకోవడం వల్ల లాభమే కాదనీ నష్టం లేదని చెప్పారు. అంత మాత్రాన పవన్ కల్యాణ్ తెలుగుకు ద్రోహం చేసినట్లుగా మాట్లాడారు.
కొంత మంది పెద్దమ్మకు పట్టుచీర పెట్టే ముందు.. కన్నతల్లికి అంటే తెలుగుకు భోజనం పెట్టాలని కామెంట్ చేస్తున్నారు. ఇలా మాట్లాడేవాళ్లు.. జగన్ రెడ్డి ఏపీలో తెలుగు మీడియం లేకుండా చేసినప్పుడు ఒక్కరైనా మాట్లాడారు. తెలుగు మాట్లాడటం తప్ప… ఎవరికీ చదవడం, రాయడం రాకూడదన్న ఓ పక్కా ప్రణాళికతో పని చేశారు. దాని వల్ల పేద విద్యార్థులు, తెలుగుమీడియంలో చదువుకున్న వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే రెండో భాషగా కూడా తెలుగు చెప్పేవారు తక్కువైపోతున్నారు. ఇలాంటి సమయంలో.. తెలుగు కోసం ఒక్కరూ మాట్లాడటం లేదు. కానీ పవన్ కల్యాణ్ హిందీ నేర్చుకుంటే తప్పేం లేదంటే.. అదేదో తెలుగుకు అన్యాయం చేసినట్లుగా కామెంట్లతో బయలుదేరారు.
హిందీ నేర్చుకోవాలా వద్దా అన్నది ఎవరి వ్యక్తిగత చాయిస్ వాళ్లది. నేర్చుకుంటే లాభమనుకుంటే నేర్చుకుంటారు. లేకపోతే లేదు. పవన్ కల్యాణ్ ఆ భాషను రాజకీయంతో ముడిపెట్టి ద్వేషం పెంచుకోవద్దని చెప్పారు. ఇంత తీవ్రంగా స్పందించడానికి.. ఆయనపై ఉన్న ద్వేషం..బీజేపీపై ఉన్న ద్వేషం.. కలగలిపి చూపించారు. కానీ ఏ భాషపైనైనా రాజకీయం చేయడం తప్పుడు పద్దతి. గతంలో తెలుగుకు కులాన్ని అంటగట్టిన రాజకీయనేతను తెలుగోళ్లు చూశారు. అయినా ఎవరి ఎజెండా వారిది