తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంట్రీ పెను సంచలనం సృష్టించినా, క్షేత్రస్థాయి సమీకరణాలు మాత్రం ఆయనకు సవాల్‌గా మారుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న విజయ్, రాజకీయాల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. యువతలో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆయనకు ఉన్న క్రేజ్ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందని అంచనాలు ఉన్నాయి. గతంలో విజయకాంత్ స్థాపించిన డీఎండీకే సాధించిన ఓట్ల శాతం కంటే విజయ్ ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేవలం ఫ్యాన్ బేస్ మాత్రమే ఎన్నికల్లో గెలుపును ఖాయం చేయలేదన్నది చేదు నిజం.
ఎంజీఆర్, ఎన్టీఆర్ స్థాయికి చేరడం సాధ్యమేనా?
దక్షిణాది రాజకీయాల్లో వెండితెర వేల్పులుగా వెలిగిన ఎంజీఆర్ , ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనంతో విజయ్ను పోల్చడం ప్రస్తుతానికి తొందరపాటే అవుతుందని తమిళనాడులో పండిపోయిన మీడియా, రాజకీయ దిగ్గజాలు విశ్లేషిస్తున్నాయి. అప్పట్లో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. విజయ్‌కు జనాదరణ పుష్కలంగా ఉన్నప్పటికీ, అట్టడుగు స్థాయి వరకు వెళ్లగలిగే పటిష్టమైన పార్టీ యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. కేవలం అభిమాన సంఘాల మీద ఆధారపడి ఎన్నికల యుద్ధంలో నెగ్గుకు రావడం కత్తిమీద సామేనని వారంటున్నారు.
చేరేందుకు ఆసక్తి చూపని బలమైన నేతలు
రాజకీయాల్లో అనుభవం ఉన్న సీనియర్ నాయకులు విజయ్ పార్టీ వైపు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టీవీకే సిద్ధాంతాల పట్ల స్పష్టత లేకపోవడం ,ఆ పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కుదరకపోవడం వల్ల ఇతర పార్టీల నేతలు దూరంగా ఉంటున్నారు. పొత్తుల విషయంలో కూడా ప్రస్తుతం తమిళనాడులోని పార్టీలు విజయ్‌తో కలిసి నడిచేందుకు వెనుకాడుతున్నాయి. ఈ పరిణామం విజయ్ రాజకీయ వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారింది. చిన్న చిన్న పార్టీలు కూడా విజయతో కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
క్షేత్రస్థాయిలో కేడర్ కొరత
ఏ రాజకీయ పార్టీకైనా గెలుపు గుర్రాలు కావాలంటే గ్రామ స్థాయి నుంచి పటిష్టమైన కమిటీలు ఉండాలి. విజయ్ పార్టీకి కేవలం అభిమానులు మాత్రమే ఉన్నారు తప్ప, రాజకీయ శిక్షణ పొందిన కార్యకర్తలు లేరు. ఓట్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే యంత్రాంగం లేకపోవడం వల్ల భారీ బహిరంగ సభలకు వచ్చే జనం ఓట్లుగా మారుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ ఈ సంస్థాగత లోపాలు విజయ్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. విజయ్ తన సినిమాల ద్వారా సామాజిక సందేశాలు ఇచ్చినప్పటికీ, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కోవడం, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడటం వేరే అంశం. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కేవలం గ్లామర్ సరిపోదు, బలమైన కార్యచరణ ఉండాలి. ఇతర పార్టీల నుంచి వలసలు లేకపోవడం, చేతులు కలిపేందుకు మిత్రపక్షాలు ముందుకు రాకపోవడం వంటి అంశాలు విజయ్ పార్టీని మూడో పక్షంగానే చూసేలా చేస్తున్నాయి.
