హైదరాబాద్లో లగ్జరీ అపార్టుమెంట్లను నిర్మించడంలో పేరు పొందిన డీఎస్ఆర్ గ్రూప్ పై ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. ఈ కంపెనీ బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిదని చెబుతారు.ఆయన ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన అనుబంధ కంపెనీలు, డైరక్టర్లు అందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. అయితే ఈ దాడులకు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంకు సంబంధం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
డీఎస్ఆర్ కంపెనీలో డైరక్టర్ గా ఉన్న వెంకటకృష్ణారెడ్డికి మరో కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు శ్రీనివాసా కన్ స్ట్రక్షన్స్. ఈ కంపెనీ ద్వారా రాజ్ కెసిరెడ్డి పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించారన్న ఆధారాలు లభించడంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లోనూ సంచలనం అవుతోంది . లిక్కర్ సొమ్ముతో రాజ్ కెసిరెడ్డి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. బయోడైవర్సిటీ ఎదురుగా డీఎస్ఆర్ నిర్మించిన లగ్జరీ భవనంలోనే ఆరేటి ఆస్పత్రిని కూడా రాజ్ కేసిరెడ్డి నిర్వహిస్తున్నారు.
డీఎస్ఆర్ కంపెనీలోకి లిక్కర్ స్కామ్ నిధులు పంపిణీ అయి ఉన్నట్లుగా ఆధారాలు లభిస్తే .. సంచనాత్మక విషయాలు బయటపడతాయి. బీఆర్ఎస్ ఓడిపోయే వరకూ రంజిత్ రెడ్డి ఆ పార్టీలో కీలక నేత. ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరు.