రియల్ ఎస్టేట్ స్వరూపం మారుతున్న కొద్దీ వ్యాపారం కూడా మారుతోంది. గతంలో సొంత ఇంటి కోసం, తాము నివసించేందుకు ఎక్కువ మంది ఇళ్లు కొనుగోలు చేసేవారు.
ఇప్పుడు వారితో పాటు కొత్తగా పెట్టుబడుల రూపంలో, అద్దె ఆదాయం కోసం కొనుగోలు చేసేవారు పెరిగారు. వచ్చే నాలుగైదేళ్ల ప్రణాళికలు వేసుకుంటున్నారు. వీరి ఆలోచనలకు తగ్గట్లుగా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. భూమిపూజ చేసినప్పటి నుంచి ఫ్లాట్లు అమ్మేస్తున్నాయి.
కనీసం రెండేళ్లలో హ్యాండోవర్ చేస్తామని చెప్పి ముందుగానే బుక్ చేసుకుంటున్నాయి. తక్కువ ధర అని చెబుతారు కానీ ప్రస్తుత మార్కెట్ రేటునే వసూలు చేస్తారు. రెండేళ్ల తర్వాత ఇల్లు పూర్తయ్యే సరికి కనీసం నలభై శాతం పెరుగుతుందని చెబుతారు. కానీ ఇప్పుడు ఉన్న బడా ప్రాజెక్టుల్లో రెండేళ్ల కిందట ఎంత ఉందో ఇప్పుడు కూడా దాదాపుగా అంతే ఉంది. అంటే రేట్ల పెరుగుదల పెద్దగా లేదు. ద్రవ్యోల్బణంకు తగ్గట్లుగా అరకొరగా పెరిగింది. ఇప్పుడు బిల్డర్లు డిస్కౌంట్లు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చారు.
అంటే రెండేళ్ల కిందటే కొనడం కన్నా.. ఇప్పుడు నిర్మాణ నాణ్యత చూసుకుని.. తమ ఫ్లాట్ ఎలా ఉంటుందో చూసుకుని కొనుక్కున్నా దాదాపుగా అదే రేటు పడుతుంది. ప్రస్తుతం కాస్త లగ్జరీ ఇళ్లు.. వేలల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇప్పుడు కొనుగోలు చేసినా.. కొత్తగా ప్రారంభమయ్యే ప్రాజెక్టుల్లో బుక్ చేసినా ఒకటే రేటు ఉంటుంది. రెడీ టు మూవ్ అయితే.. రెండేళ్ల పాటు టెన్షన్స్ ఉండదు.. ఇంటి అద్దె ఉండదు.