రివ్యూ: జానూ

తెలుగు360 రేటింగ్: 3/5

జ్ఞాప‌కం ఓ విత్త‌నం.
గ‌తం లోతుల్లోంచి మొక్కై విక‌సించి, అనుభూతుల సుగంధాల్ని అందిస్తుంది.
ఈరోజు చాలా సాదాసీదాగా గ‌డ‌వొచ్చు.
కానీ ఈ ప్ర‌యాణం రేప‌టికి జ్ఞాప‌కం.
ఓ బాధ‌, ఓ క‌ష్టం, ఓ ప్రేమ – ఈరోజు ఇబ్బంది పెట్టొచ్చు.
కానీ రేప‌టికి అదే అంద‌మైన జ్ఞాప‌కం.
కొంత‌మందికి జ్ఞాప‌కాలే జీవితాలు. జ్ఞాప‌కాల కోస‌మే జీవిస్తుంటారు.
అందుకే.. పాత ఫొటో క‌నిపించ‌గానే మ‌న‌సు చెమ్మ‌గిల్లుతుంది.
పాత స్నేహితులు ఎదుర‌వ్వ‌గానే – క‌ళ్లు విక‌సిస్తాయి. గ‌తానికి ఇచ్చే విలువ అది.
మ‌న‌ల్ని పాత రోజుల్లోకి లాక్కెళ్లిపోయే సినిమాలంటే అందుకే అంత ఇష్టం. ఆటోగ్రాఫ్‌, ప్రేమ‌మ్‌.. గుండె లోతుల్లో దాక్కున్న గురుతుల్ని భూత‌ద్దం పెట్టి చూపించాయి. ఇప్పుడు ఈ `జానూ` కూడా అంతే!

ఏముంది ఈ క‌థ‌లో?

ఇద్ద‌రు పాత ప్రేమికులు క‌లుస్తారు. ఎప్పుడో ప‌దో త‌ర‌గ‌తి ప్రేమ ఇది. ప‌దిహేనేళ్ల క్రితం క‌లుసుకున్న మ‌న‌సులు. అప్పుడు చూసుకున్న మొహాలు. ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది, ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయి జ్ఞాప‌కాల‌తోనే జీవితాన్ని మోస్తున్నాడు. తెల్లారితే ఇద్ద‌రూ విడిపోయి, ఎవ‌రి దారిలో వాళ్లు వెళ్లిపోవాలి. మ‌రి ఆ రాత్రి ఇద్ద‌రూ ఏం చేశారు? ఏం మాట్లాడుకున్నారు? గ‌తాన్ని ఎలా త‌వ్వుకున్నారు? మ‌ళ్లీ `బై` చెప్పుకుని ఎలా వెళ్లిపోయారు.. ఇదే క‌థ‌.

ఇంత సింపుల్ లైన్‌ని ప‌ట్టుకుని, ప్రేమ్‌కుమార్ అనే ద‌ర్శ‌కుడ్ని న‌మ్మి – విజ‌య్ సేతుప‌తి, త్రిష లాంటి స్టార్లు ఆఫ‌ర్ ఇచ్చారంటేనే ఈ క‌థ‌లో, క‌థ‌నంలో ఏదో మ్యాజిక్ ఉంద‌ని అర్థం చేసుకోవాలి. అదే.. 96 రీమేక్‌తో రుజువైంది కూడా. దిల్ రాజు కూడా మ్యాజిక్‌నే న‌మ్మాడు.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాని రీమేక్ చేయ‌డం వేరు. ఓ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీని, అందునా ఇలాంటి క్లాసిక్స్‌ని రీమేక్ చేయ‌డం వేరు. ఓ విధంగా చెప్పాలంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమా రీమేకులే సుఖం. ఎందుకంటే ఇక్క‌డి హీరోల ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా మార్పులూ చేర్పులూ చేసుకోవ‌చ్చు. రీమేక్ అన‌గానే క‌థ‌లో ఎంతో కొంత విష‌యం ఉండే ఉంటుంది. దానికి హీరో ఇమేజ్ తోడ‌వుతుంది. కాబ‌ట్టి ప‌ని సుల‌భం అవుతుంది. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీలు అలా కాదు. ఆయా సినిమాల్ని బ‌తికించేవే.. మూమెంట్స్. అనుభూతులు. అనుభ‌వాలు. చిన్న చిన్న స‌న్నివేశాలు. వాటిని వ‌దిలేయ‌కూడ‌దు. అప్ప‌టి భావోద్వేగాలు మ‌ళ్లీ క‌ల‌గాలంటే, ఆ మ‌త్తు మ‌ళ్లీ ఎక్కాలంటే – త‌ప్ప‌కుండా మార్పులు చేర్పులూ లేకుండా తీయాల్సిందే. అందుకే జానూలోనూ వేలు పెట్ట‌డానికి ద‌ర్శ‌కుడు ధైర్యం చేయ‌లేదు. 96లో ఏముందో, జానూలో అదే క‌నిపిస్తుంది. అదే వినిపిస్తుంది.

కాబ‌ట్టి జానూ చూడాల‌నుకునేవాళ్లు, ఇది వ‌ర‌కు 96 కూడా చూసుంటే, ఆ తాలుకూ భావాల్ని, పోలిక‌ల్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టాలి. దీన్నో కొత్త సినిమాలా చూడ‌గ‌ల‌గాలి. అప్పుడు త‌ప్ప‌కుండా ఆ మ్యాజిక్ క‌నిపించ‌డం మొద‌లవుతుంది. రీ యూనియ‌న్ అనే కాన్సెప్టు కొత్త కాదు. ఇది వ‌ర‌కు చూసిందే. కానీ.. ఇక్క‌డ ఓ విఫ‌ల ప్రేమికులు మ‌ళ్లీ క‌ల‌వ‌డం, వాళ్ల పాత జ్ఞాప‌కాల్ని నెమ‌రేసుకోవ‌డం మాత్రం కొత్త‌గానే అనిపిస్తుంది. హైస్కూల్ ప్రేమ‌క‌థ ఎప్పుడు మొద‌ల‌వుతుందో, అప్పుడు మ‌న చిననాటి జ్ఞాప‌కాలు కూడా వ‌రుస క‌డ‌తాయి. అప్ప‌టి స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌లు, అనుభూతులు క‌ళ్లుముందు క‌ద‌లాడ‌తాయి. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ – ప్రేమ‌మ‌య‌మే.

ఆ త‌ర‌వాత రామ్ – జానూల ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. ఒక‌రు ఇంకొకరికి దూర‌మ‌య్యామ‌న్న నిజాన్ని ఒప్పుకోగ‌లి, వాళ్ల ప్ర‌స్తుతాన్ని కూడా స్వీక‌రించి – ఎప్ప‌టిలా స్నేహితుల్లా ప్ర‌యాణం చేయాల‌నుకోవ‌డం ఈ ప్రేమ‌లోని స్వ‌చ్ఛ‌త‌కు, నిజాయ‌తీకీ నిలువుట‌ద్దం. ఒక్క ముద్దు.. ఒక్క హ‌గ్ కూడా లేకుండా – చిన్న స్ప‌ర్శ‌తో – ఎన్నో భావాల్ని ఆవిష్క‌రిస్తూ – అమ‌లిన ప్రేమ గాధ‌ని చూపించాడు ద‌ర్శ‌కుడు. ఈ విష‌యంలో త‌న ప్ర‌తిభాపాట‌వాల కంటే, ప్రేమ‌పై త‌న‌కున్న న‌మ్మ‌కం, ఇచ్చిన గౌర‌వం ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అక్క‌డ‌క్క‌డ గుండె బ‌రువెక్కించే స‌న్నివేశాలు, మ‌న‌సు మోయ‌లేని భావోద్వేగాలు క‌నిపిస్తాయి. కాక‌పోతే ఒక‌టే ఇబ్బంది. బాగా స్లో నేరేష‌న్‌. `నేను రాసుకున్న‌దంతా చెప్పాల్సిందే` అనే పంతం ద‌ర్శ‌కుడిలో క‌నిపించింది. ఇలాంటి సినిమాల‌కు ఈ త‌ర‌హా నేరేష‌న్ న‌ప్పుతుంది. కాక‌పోతే.. ఆ పాత్ర‌ల‌తో, సన్నివేశాల‌తో ప్రేక్ష‌కుడు కూడా ప్ర‌యాణం చేయ‌గ‌లిగితేనే ఆ ఎమోష‌న్ అర్థం అవుతుంది. మిగిలిన‌వాళ్ల‌కు బోరింగ్‌గా అనిపించొచ్చు.

2004 నాటి బ్యాచ్ మ‌ళ్లీ క‌లిసిన‌ట్టు చూపించారు. మాతృక‌లో 96 బ్యాచ్ ఇది. 96లో ఇళ‌య‌రాజా ప్ర‌భావం ఎక్కువ‌. 2004 వ‌చ్చేస‌రికి రెహ‌మాన్ విజృంభ‌ణ క‌నిపిస్తుంది. అయినా అప్ప‌టి ఇళ‌య‌రాజా పాట‌లే వినిపిస్తాయి. ఈ క‌థ‌క్కూడా 1996 నేప‌థ్య‌మే తీసుకుంటే బాగుండేది.

త్రిష‌, విజ‌య్‌సేతుప‌తి – 96 సినిమాని త‌మ భుజాల‌పై వేసుకుని న‌డిపించారు. మ‌రీ ముఖ్యంగా త్రిష‌కు రీప్లేస్‌మెంట్ వెద‌క‌డం క‌ష్టం. కానీ స‌మంత మాత్రం ఆలోటు తీర్చేసింది. చాలాచోట్ల స‌మంత త్రిష‌ని గుర్తు చేయ‌గ‌లిగింది. మ‌రీ ముఖ్యంగా భావోద్వేగ భ‌రిత స‌న్నివేశాల్లో త‌న అనుభ‌వాన్ని చూపించింది. శ‌ర్వా న‌ట‌న‌కూ వంక పెట్ట‌లేం. త‌నెప్పుడూ కెమెరా ముందు నిజాయ‌తీగానే ఉంటాడు. క‌థ‌కు, పాత్ర‌కు ఏం కావాలో అది చేస్తాడు. ఈసారీ అంతే. చిన్న‌ప్ప‌టి శ‌ర్వా, స‌మంత‌లా క‌నిపించి జోడీ కూడా ఆక‌ట్టుకుంది. ఓ విధంగా చెప్పాలంటే శ‌ర్వా – స‌మంత కంటే, వాళ్లిద్ద‌రి మధ్య కెమిస్ట్రీనే న‌చ్చుతుంది.

పాట‌లు క‌థ‌లో భాగమైపోయాయి. విడిగా వింటే అంత‌గా న‌చ్చ‌ని పాట కూడా తెర‌పై మాత్రం వెలిగింది. క‌థ‌తో పాటు ప్ర‌యాణం చేసింది. ఫొటోగ్ర‌ఫీ, నేప‌థ్య సంగీతం, ఎడిటింగ్ నైపుణ్యం ఇవ‌న్నీ సినిమాకి క‌లిసొచ్చాయి. ప‌రిమిత బ‌డ్జెట్‌లో తీసేసిన సినిమా ఇది. త‌క్కువ పాత్ర‌లు, త‌క్కువ లొకేష‌న్లు క‌నిపిస్తాయి. ఓర‌కంగా దిల్ రాజుని ఈ విష‌యం కూడా బాగా ప్రేరేపించి ఉండొచ్చు.

మ్యాజిక్‌ని రీ క్రియేట్ చేయ‌డం క‌ష్టం అంటుంటారు. అది నిజ‌మే. బాపు బొమ్మ‌ని మ‌రోసారి గీయ‌లేం. బాలు పాట‌ని మ‌రొక‌రు అదే స్థాయిలో పాడ‌లేరు. కాక‌పోతే.. ఎక్క‌డైనా ఓ మంచి గొంతు వినిపిస్తే… మ‌న‌సుకు స్వాంత‌న ల‌భిస్తుంది. ఈ సినిమాకూడా అంతే.

ఫినిషింగ్ ట‌చ్‌: జ్ఞాప‌కాల మ‌యం

తెలుగు360 రేటింగ్: 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జిల్లా విభజనకు వ్యతిరేకంగా ధర్మాన ..!

వైసీపీలో మరో అసంతృప్తి స్వరం మెల్లగా బయటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు .. శ్రీకాకుళం జిల్లాలను.. విభజించబోతున్నారన్న ప్రచారం నేపధ్యంలో హఠాత్తుగా వ్యతిరేక ప్రకటన చేశారు. శ్రీకాకుళం...

తెలంగాణ రాజకీయల్లో మళ్లీ ” సెక్షన్ 8″ ..!

సెక్షన్ 8 అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త కలకలం రేపుతోంది. పాత సెక్రటేరియట్‌ను కూల్చివేయడానికి గవర్నర్ అనుమతి తీసుకున్నారా.. అనే ప్రశ్నతో.. కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. ఎందుకంటే.. హైదరాబాద్ పదేళ్ల...

ఓటీటీ వైపు చూస్తున్న కీర్తి సినిమాలు

ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లైంది.. 'పెంగ్విన్‌'. కీర్తి సురేష్ న‌టించిన ఈసినిమాకి రివ్యూలూ, రేటింగులూ ఆశాజ‌న‌కంగా లేవు. కానీ... వ్యూవ‌ర్ షిప్ మాత్రం బాగానే వ‌చ్చింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల...

ఎస్‌ఈసీ విషయంలో మరోసారి ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ..!

అటు కనగరాజు.. ఇటు నిమ్మగడ్డ కాకుండా.. మూడో వ్యక్తిని ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా.. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు గండి పడింది. అధికారులు విధులు నిర్వహించలేకపోతున్నారని అందు...

HOT NEWS

[X] Close
[X] Close