దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు ఒక రాజకీయ శూన్యత కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆయన నియోజకవర్గంలో నేరుగా అందుబాటులో ఉండటం అరుదు. చారిత్రకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుండి స్థానిక రాజకీయాలను ఆయన సోదరులు, కుటుంబ సభ్యులే పర్యవేక్షించేవారు. గత ఐదేళ్లుగా అవినాష్ రెడ్డి కుటుంబం పులివెందుల బాధ్యతలను భుజాన వేసుకున్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అధికార మార్పు ఆ పట్టును సడలించాయి. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నారు కానీ, అందుబాటులో లేరు అనే భావన స్థానికుల్లో బలంగా వినిపిస్తోంది.
పట్టించుకోని అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలు అవినాష్ రెడ్డి కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. సీబీఐ విచారణలు, కోర్టుల చుట్టూ తిరగడం, షర్మిల చేస్తున్న ఘాటైన విమర్శల కారణంగా ఆ కుటుంబం పులివెందుల రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతోంది. ఒకప్పుడు పులివెందులలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించే స్థాయిలో ఉన్న ఈ కుటుంబం, ఇప్పుడు తామే ఆత్మరక్షణలో పడటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి దిశానిర్దేశం కరువైంది. దీనివల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు.
ఖాళీని భర్తీ చేస్తున్న రవి, భూమిరెడ్డి
పులివెందులలో గతంలో టీడీపీ అంటే కేవలం నామమాత్రపు ఉనికికే పరిమితమయ్యేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. టీడీపీ తరపున ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి , బీటెక్ రవి నిరంతరం ప్రజల్లో ఉంటూ వైసీపీ వదిలేసిన ఖాళీని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వారు చురుగ్గా పాల్గొంటూ, అభివృద్ధి పనులపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వర్గాలను, అలాగే సామాన్య ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో ఈ ఇద్దరు నేతలు సఫలీకృతమవుతున్నారు. ఇది పులివెందుల రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుగా కనిపిస్తోంది.
వైసీపీ కేడర్‌లో నిరాశ – దిక్కుతోచని స్థితి
ముఖ్యమంత్రి మావాడే అన్న గర్వంతో ఐదేళ్లు పులివెందుల వైసీపీ కార్యకర్తలు ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు అధికారం పోవడంతో పాటు, స్థానిక నాయకత్వం కూడా బలహీనపడటం వారిని మానసికంగా కుంగదీస్తోంది. ఏ చిన్న పనైనా కావాలన్నా తమ నాయకులు అందుబాటులో లేకపోవడం, పైగా కేసులు , వివాదాలతో వారు సతమతమవుతుండటం కేడర్‌ను ఒంటరిని చేసింది. ఎమ్మెల్యే లేని లోటు కేవలం అభివృద్ధి విషయంలోనే కాకుండా, తమకు అండగా నిలబడే భరోసా విషయంలో కూడా స్పష్టంగా కనిపిస్తోందని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
భవిష్యత్తు సవాల్
పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి ఏకపక్ష విజయం అందించే ప్రాంతం. అయితే, ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో టీడీపీ తన పట్టును మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఒకవైపు సొంత చెల్లెలు షర్మిల నుండి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు, మరోవైపు స్థానికంగా బలపడుతున్న ప్రతిపక్ష నేతలు జగన్ కోటను బీటలు వారుస్తున్నాయి. అయితే తమ కుటుంబానికే వారంతా బానిసల్లా ఉంటారని..తమకు తప్ప ఎవరికీ ఓటేయరన్న ఓ ధీమాతో.. ఈ పరిణామాలను వైఎస్ కుటుంబీకులు తేలికగా తీసుకుంటున్నారు.
