జగన్ తన సతీమణితో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమయ్యారు. గత వారం అసలు తాడేపల్లి వైపునకే రాని దంపతులు.. ఈ సారి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి .. దొరకడంతో సోమవారం పొద్దున్నే వచ్చేశారు. మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో సమావేశమయ్యారు. మామూలుగా ఏమైనా సమస్యలు వస్తే.. పార్టీ నేతలతో కలిసి వెళ్లి విజ్ఞాపనపత్రం ఇచ్చి వస్తారు. సీఎంగా ఉంటే.. భార్యను తీసుకెళ్లి కలిసినా ఓ అర్థం ఉండేది. కానీ ఆయన ప్రతిపక్ష నేతగా కూడా లేరు. అయినా సరే తన సతీమణిని తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లడంతో.. ప్రస్తుత రాజకీయాల నుంచి గట్టెక్కించమని కోరే ప్రయత్నంలో భాగమేనని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు.
లిక్కర్ స్కాం తన మెడకు చుట్టుకుంటున్న సమయంలో .. లోపలికి వెళ్తే బయటకు రావడం కష్టమని జగన్ అనుమాన్తున్నారు. అందుకే.. అలాంటి పరిస్థితి రాకుండా.. బీజేపీ పెద్దలకు గవర్నర్ ద్వారా ఏదైనా రాయబారం పంపే ప్రయత్నం చేసి ఉంటారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. గతంలో సీఎంగా చేసినప్పుడు గవర్నర్ తో ఉన్న పరిచయాల మేరకు.. ఆయన సాయం చేస్తారని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా అంచనాకు వస్తున్నారు. పార్టీ నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తూండటంతో జగన్ కంగారు పడుతున్నారు.
అరెస్టు అవుతున్న వారిలో అసలు అక్రమ అరెస్టులు అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అందరికీ న్యాయపరమైన అవకాశాలు అన్నీ వాడుకునే అవకాశం కల్పిస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతోనే అరెస్టు చేస్తున్నారు. అందుకే గవర్నర్ కూ ఏమి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఆయనకు ఉంది. మరో వైపు నెలాఖరులో నెల్లూరు వెళ్లి.. జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని.. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు.