ఇప్పటి వరకూ క్యాడర్ , లీడర్ అడపా దడపా బిగ్ బాస్ మాదిరిగా టాస్కులు ఇచ్చి.. ర్యాలీలు చేయించిన జగన్ ఇప్పుడు మరో టాస్క్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇళ్ల స్థలాలను ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తోందని ఆరోపిస్తూ.. రండి రోడ్డెక్కుదాం అని అందర్నీ పిలుస్తున్నారు. అందర్నీ రోడ్డెక్కిస్తారు కానీ ఆయన మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో కాళ్లు చాపి కూర్చుంటారు.. అది వేరే విషయం. అసెంబ్లీకి రాకుండా.. ఓ చాట భారతం స్క్రిప్ట్ ను తన ట్విట్టర్లోల పోస్టు చేశారు.
జగన్ రెడ్డి తాను వేల కోట్లు ఖర్చు పెట్టి పేదలకు ఇళ్లిస్తే వాటిని రద్దు చేస్తారా అని ఆవేశపడ్డారు. రిజిస్ట్రేషన్లు చేశామని..ఇళ్లు కట్టామని.. మౌలిక సదుపాయాలు కల్పించామని..తాము ఇళ్లు కాదు.. ఊళ్లు కట్టామన్నారు. మరి అన్ని అలా కట్టేసి ఉంటే.. ఇప్పుడు ఎలా రద్దు చేస్తారన్న చిన్న లాజిక్ ఆలోచించలేకపోయారు. అబద్దాల పునాదుల మీద.. కళ్ల ముందు కనిపించే వాటిని కూడా.. కట్టేసినట్లుగా చెప్పుకునే ఘోరమైన మైండ్ సెట్ తో ఉండే వైసీపీ నేతలకు.. జగన్ రెడ్డి ప్రకటనలు కాస్త వింతగా ఉన్నా.. ఫాలో అవక మరో మార్గం లేదు.
ఊరవతల.. శ్మశానాలు, కొండలు, గుట్టల్లో సెంట్ స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు ఎందుకూ పనికి రావు.సెంట్ స్థలంలో అసలు ఇల్లు కట్టడం అసాధ్యం. అయినా అవే పది లక్షలు చేస్తాయని చెప్పుకుంటున్నారు. పాతిక లక్షల ఆస్తి పేదలకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. జగన్ రెడ్డి పేదల ఇళ్ల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారు. తమ పార్టీ నేతలకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు దోచి పెట్టారు. వారు పనులు చేయలేదు. అలాగే స్థలాలను పార్టీ నేతల వద్దే కొని వేల కోట్లు వారికి ధారబోశారు. ఈ అవినీతిని పేదల పేరుతో కప్పి పుచ్చుకునేందుకు ఇప్పుడు కొత్త రాజకీయాలు ప్రారంభించారు.