కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం పాదయాత్ర సందర్భంగా ప్రధాని మోడీకి భయపడి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా గురించి పోరాడటం లేదని విమర్శలు చేసినప్పుడు, జగన్ చాలా తీవ్రంగా స్పందించినప్పటికీ అతని మాటలను బాగానే చెవికెక్కించుకొన్నట్లుంది. తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆగస్ట్ 10న ధర్నా చేయబోతున్నారు. కానీ “జగన్మోహన్ రెడ్డికి ఇంత హటాత్తుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలనే విషయం, దాని గురించి కేంద్రాన్ని గట్టిగా అడగాలనే విషయం గుర్తుకు వచ్చిందా?” అని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి ఎద్దేవా చేసారు.
ఇంతకు ముందు ప్రత్యేకహోదా తదితర అంశాల గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా నేతలు నిలదీసినప్పుడు “పార్లమెంటులో మా ఎంపీలు మాట్లాడుతున్నారు కనుక దాని గురించి తను మాట్లాడవలసిన అవసరం లేదని” జగన్ సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడు కూడా వైకాపా ఎంపీలు పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ జగన్ హటాత్తుగా డిల్లీలోనే దీక్ష చేయాలనుకొంటే ఎవరికయినా అనుమానం కలగడం సహజమే. అది కూడా రాహుల్ గాంధీ సూచించిన తరువాత చేయాలనుకోవడం మరింత అనుమానాలు కలిగిస్తున్నాయి.
అది యాదృచ్చికమో లేక ముందస్తు ప్రణాళికో తెలియదు ఒకే సమయంలో, ఒకే జిల్లాలో రాహుల్, జగన్ ఇద్దరు రైతు భరోసా యాత్రల చేశారు. ఆ సమయంలో రాహుల్ ప్రత్యేకహోదా గురించి మాట్లాడటం, జగన్ తక్షణమే దాని గురించి పోరాడేందుకు సిద్దపడటం గమనిస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తల్లి కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేందుకు తెర వెనుక కధ ఏమయినా నడిచిందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో రెండు పార్టీల పరిస్థితులను బట్టి చూసినట్లయితే ఆ అనుమానాలు నిజమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ కనుమరుగయిపోతోంది. కనుక ఒకవేళ జగన్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఇష్టపడితే అతనికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అప్పగించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తన నేతలను కాపాడుకోవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే అందులో అసహజమేమీ లేదు. ఇక ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురవుతున్నా కూడా రాష్ట్రంలో తెదేపా-బీజేపీల బంధం నేటికీ పటిష్టంగానే ఉంది. కనుక బీజేపీతో జత కట్టడం కోసం ఇంకా వేచి చూస్తూ దాని పట్ల మెతక వైఖరి కనబరిస్తే, అంతిమంగా వైకాపా పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారి దానికే తీరని నష్టం జరుగవచ్చును.
ఆ సంగతి రాహుల్ గాంధీ పరోక్షంగా చేసిన సూచనలతో జగన్ కి అర్ధమయి ఉండవచ్చును. అటువంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రత్యేకహోదా తదితర అంశాల కోసం పోరాటాలు ఆరంభిస్తే ఇక్కడ రాష్ట్రంలో తెదేపాను, అక్కడ కేంద్రంలో బీజేపీని ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా దెబ్బ తీయవచ్చుననే ఆలోచనతోనే ప్రత్యేకహోదా పేరుతో ఆ రెండు పార్టీలు డిల్లీలో చేతులు కలుపుతున్నయేమో? అందుకే ఎన్నడూ మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనేది చేయని జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా మోడీ ప్రభుత్వాన్ని నేరుగా డ్డీ కొనేందుకు సిద్దపడుతున్నారేమో? కనుక జగన్ డిల్లీలో చేయబోయే దీక్ష ప్రత్యేకహోదా కోసమా? లేక కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కోసమా? కాలమే చెప్పాలి.