ప్రియమయిన చంద్రబాబుకి ప్రేమతో జగన్ సంజాయించునది ఏమనగా…

వర్తమాన రాజకీయాలలో నీతి నిజాయితీకి ఆయనే కేరాఫ్ అడ్డ్రెస్. ఓదార్పు యాత్రలకు, విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు ఆయనకే స్వంతం. రాజకీయ నేతలలో మడమ తిరగక బాధపడేవాడు ఆయనొక్కడే..పాపం. ప్రజలకిచ్చిన మాట కోసం ఏకంగా 18 నెలలు జైల్లో ఉన్న గొప్ప ప్రజాభిమాని. ఆయన హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు ఎక్కడ ఒకరి కంటే ఎక్కువ మంది చనిపోయినా రెక్కలు కట్టుకొని ఎగిరి వెళ్లి అక్కడ వాలిపోయి వాళ్ళ కుటుంబాలను మీడియా సాక్షిగా ఓదార్చే గొప్ప మనసున్నవాడు.ఆంధ్రాలో రాజకీయాలు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం కోసం పరితపించేపోయే విశాల హృదయం ఉన్నవాడు.

ఆయన గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు…సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చుగా…అని జనాలు విసుక్కోవచ్చును. కానీ ఇప్పుడు ప్రతీ సినిమాకి టైటిల్ తో బాటు సబ్ టైటిల్ పెట్టడం లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి రాజకీయ నాయకుల గురించి కూడా ఈ సబ్ టైటిల్స్ తప్పడం లేదు.లేకపోతే సదరు నేతని ఫాలో అయ్యే జనాలు తెగ హర్ట్ అయిపోతుంటారు. అలాగని ఇంత గొప్పగా వ్రాసినా ఇదేమి వెటకారం? అని కోప్పడిపోయేవాళ్ళు ఉండవచ్చును. కానీ దేవుడ్ని ఏ రూపంలోనయినా కొలుచుకొనే వెసులుబాటున్నట్లే మనకి నచ్చిన వాళ్ళని ఏవిధంగానయినా మెచ్చుకొనే ఆప్షన్ కూడా ఉంటుంది.

ఇక విషయంలోకి వస్తే త్వరలో జరుగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో తను కేవలం ప్రజా సమస్యల గురించి మాత్రమే సీరియస్ గా చర్చించాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్పీకర్ కోడెలకి జగనన్న ఒక ఓపెన్ లెటర్ పోస్ట్ చేసారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలలో తను టోటల్ 19 సమస్యల గురించి ప్రశ్నలు అడుగుతానని అన్నిటికీ ప్రభుత్వం ప్రిపేర్ అయ్యి రావాలని సూచించారు. ఈసారి మాత్రం పూర్తిగా ప్రజా సమస్యలపై చర్చలకే అందరం కమిట్ అయిపోదామని తన లేఖలో సీయంకి సజెస్ట్ చేసారు. “కుట్రలు, కుతంత్రాలపై అసలు మాట్లాడుకోవద్దు” అనే వాఖ్యాన్ని అండర్ లైన్ చేశారు.

ఆయన వ్రాసిన ఈ లేఖని చూసి అదేమిటి “మా మనసులో మాటని ఆయన అప్పుడే ఎలా క్యాచ్ చేసేసారో” అని తెలుగు తమ్ముళ్ళు తెగ ఆశ్చర్యపోయారు. ఓటుకి నోటు కేసులో జగనన్న స్పీడు, తెరాసతో ములాఖాత్ లు చూసి తమ్ముళ్ళు చాలా షాక్ అయిపోయారు. తమ టైం చాలా బ్యాడ్ గా ఉన్నప్పుడు తమ గురించి, తమ ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి భవిష్యత్ గురించి జగనన్న చెప్పిన జ్యోతిష్యం చూసి బాగా హర్ట్ అయిపోయున్నారు. జనాలలో ఏదో కాస్త మంచి పేరు సంపాదించుకొనే యావతో పుష్కరాలకి వచ్చిన జనాలకి ఏదో చిన్న సిన్మా చూపిద్దామని చంద్రన్న అంత కష్టపడితే, అక్కడ జరిగిన ట్రాజెడీని సినిమా స్కోపులో చూపించి చంద్రన్న ఇజ్జత్ తీసేసాడు జగనన్న. చంద్రన్నకి కంటి మీద కునుకు లేకుండా తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు జగనన్న. అందుకే ఈసారి అసెంబ్లీ సమావేశాలలో అన్నయ్యకి గట్టిగా అటాక్ ఇచ్చేయాలని తమ్ముళ్ళు అందరూ రెడీ అయిపోతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా జగనన్న ఇలాగ బహిరంగ లేఖ పోస్ట్ చేసినట్లున్నాడు. కానీ అంతమాత్రాన్న తమ్ముళ్ళు అన్నయ్యని వదిలిపెట్టేస్తారను కోనవసరం లేదు.

అలాగని జగనన్నని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఓదార్పు యాత్రలే కాదు…అవసరమయితే ఏకంగా నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహరణ దీక్షలు చేయగలవాడు. మైక్ పట్టుకొంటే అసెంబ్లీని కూడా తన స్వంత మీడియాలాగే భావిస్తూ పార్లమెంటరీ బాషకు ఎక్కడా భంగం కలగకుండా చాలా గౌరవంగా అధికార పార్టీని తిట్టిపోయగలడు. వెనకనున్న వైకాపా తమ్ముళ్ళు చెల్లాయిలు కండువాలు సర్దుకొంటూ బల్లలు చరుచుకొంటూ కాలక్షేపం చేయాల్సిందే తప్ప వాళ్ళకి మైక్ దొరకనీయడు.

తెలుగు తమ్ముళ్ళు తలుచుకొంటే వార్ వన్ సైడ్ అవకపోవచ్చును..ఎందుకంటే వాళ్ళకి చంద్రన్న సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వైకాపాకు జగనన్నే అన్నయ్య గాబట్టి ఆయన తలుచుకొంటే ఇక వార్ ఒన్ సైడ్ అయిపోవలసిందే…క్రిందటిసారి సమావేశాలలో ఆయనే అసెంబ్లీ ని ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసినప్పుడే ఆ సంగతి అందరికీ తెలుసుండాలి. అయినప్పటికీ కురుక్షేత్ర యుద్ధం ముందు శ్రీకృష్ణ రాయభారాలు, గీతోపదేశాలు తప్పనట్లే అసెంబ్లీ సమావేశాల ముందు కూడా ఆయన తన సైడ్ నుండి మిస్టేక్ లేకుండా ఒక లెటర్ కొట్టి పడేశాడు.

“మేము ప్రజా సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలనుకొంటున్నాము…దానికి మీరు రెడీనా? ”ఓటుకి నోటు కేసు….అందులో వైకాపా రోల్…అంటూ మమ్మల్ని కెలకొద్దు…కెలికి ఆనక మేము తిట్టి పోస్తే మళ్ళీ బాధపడొద్దు” అని పార్లమెంటరీ బాషలో చాలా మంచిగానే సంజాయించే ప్రయత్నం చేసాడు జగనన్న. కానీ వినకుండా, చంద్రన్న ఒంటరిగా వచ్చినా…తన 105 మంది తమ్ముళని వెంటపెట్టుకొని వచ్చినా జగనన్న ఫైట్ కి రెడీయే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com