వైసీపీ అధినేత జగన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకున్నారు. అక్టోబర్ నెలలో తాను యూరప్‌లో పదిహేను రోజుల పాటు పర్యటించాలనుకుంటున్నాని అనుమతి ఇవ్వాలని కోరారు. జగన్ పిటిషన్ ను స్వీకరించిన సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. వచ్చే నెలలో పదిహేను రోజుల పాటు యూరప్ కు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అయితే వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా సీబీఐ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
నవంబర్ ఒకటి నుంచి 14వ తేదీలోపు కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో జగన్ విదేశాల నుంచి తిరిగి వస్తే.. కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ పాస్ పోర్టు ..బెయిల్ షరతుల ప్రకారం కోర్టు స్వాధీనంలో ఉంటుంది. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చాక మళ్లీ పాస్ పోర్టు కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
జగన్ 2019 ఎన్నికలకు ముందు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉండేది. ఎన్నికల్లో గెలిచిన తరవాత ఆయన కోర్టుకు హాజరవడం మానుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకు హాజరు కాలేదు. అధికారం పోయాక కూడా ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. ఆయన కేసులు ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్లి వచ్చాక వ్యక్తిగతంగా కోర్టు హాజరు కావాలని ఆదేశించడంతో ఇక రెగ్యులర్ విచారణకు హాజరవమని ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.