తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు మారింది. అసలు ఈ వ్యవహారంలో జగన్ పాత్ర ఉందని ఇప్పటి వరకు అటు ప్రభుత్వం కానీ, ఇటు విచారణ చేస్తున్న సిట్ కానీ ఎక్కడా ఆరోపణలు చేయలేదు. ఆయనపై అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. చివరికి టీడీపీ కూడా నేరుగా ఆయనపై వేలెత్తి చూపలేదు. కానీ, జగన్ మాత్రం మొదటి నుంచి ఈ కల్తీ నెయ్యి కేసును తన నెత్తిమీద వేసుకుని భుజాలు తడుముకుంటున్నారు.
దొరికిపోతాననేదే జగన్ భయమా!?
ఈ మొత్తం గొడవలో ఎవరూ తనను ఏమీ అనకముందే, ఆయనే మైకు పట్టుకుని నేను క్లీన్, అసలు కల్తీ జరగలేదు అని గొంతు చించుకోవడం చూస్తుంటే.. దొంగ దొరికిపోతానేమో అన్న కంగారులో ముందే అరిచినట్టు కనిపిస్తోంది. ఒకవైపు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పు జరిగింది, బాధ్యులపై చర్యలు తీసుకోండి అంటూ తెలివిగా సైడ్ అయిపోయే ప్రయత్నం చేస్తుంటే.. జగన్ మాత్రం టీడీపీ హయాంలోనే కల్తీ జరిగింది అంటూ పాత రికార్డును తిరగేస్తూ దొరికిపోతున్నారు. చిత్ర విచిత్రమైన లాజిక్కులతో గంటల తరబడి ప్రెస్మీట్లు పెడుతున్నారు.
తాను అంటించుకున్నదాన్ని చంద్రబాబు అంటించి సమం చేయాలని ప్లాన్
తనకు అంటిన ఈ కల్తీ నెయ్యి బురదను కాస్త చంద్రబాబు నాయుడి హెరిటేజ్ సంస్థకు అంటించగలిగితే, ఇక బ్యాలెన్స్ అయిపోతుందని జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లున్నారు. అందుకే ఇందాపూర్ నుంచి ఇటలీ వరకు కథలు వెతుకుతూ, లేని సంబంధాలను అంటగట్టేందుకు తాపత్రయపడుతున్నారు. కానీ, లాజిక్ ఏంటంటే.. అసలు ఈ బురద ఆయన మీదకు ఎవరు విసిరారు.. ఆయనే కదా స్వయంగా వంగి మరీ అంటించుకుంది! ఎవరూ అడగకుండానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం వెనుక ఉన్న ఆ అపరాధ భావం ఏంటో సామాన్య జనాలకి కూడా అర్థమైపోతోంది.
సీబీఐ సిట్ నివేదికను అంగీకరించారు కదా .. ఇంకెందుకుగోల!?
దర్యాప్తు సంస్థలు కాంట్రాక్టులు, టెండర్లు, నాణ్యతా ప్రమాణాల మీద దృష్టి పెడితే.. జగన్ మాత్రం మొత్తం రాజకీయ కోణంలో రభస చేస్తున్నారు. నిజంగా కల్తీ జరగకపోతే లేదా తనకు సంబంధం లేకపోతే అంత కంగారు పడిపోవాల్సిన అవసరం ఏముందన్నది ప్రధాన ప్రశ్న. భుజాలు తడుముకోవడం మరీ ఎక్కువైతే, చూడటానికి అది నేరం ఒప్పుకున్నట్లే ఉంటుందని ఆయన సలహాదారులు ఎవరైనా చెబితే బాగుండేది. జగన్ రెడ్డి వింత వాదనలు, తనను తాను సమర్థించుకునేందుకు పడుతున్న ఆరాటం చూస్తుంటే.. ప్రజలు ఇక ఆయన చెప్పే మాటలను కామెడీగానే తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. దొంగను పట్టుకోకముందే నేను కాదు అని పరుగెత్తే వ్యక్తిని చూసి జనం ఏమనుకుంటారో, ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
