ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా సోషల్ మీడియాకు మార్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న కల్తీ పాలు, కలుషిత నీటి మరణాల వంటి అత్యంత సున్నితమైన అంశాలపై ఆయన హెల్లో ఇండియా అంటూ ఎక్స్ వేదికగా దేశం మొత్తానికి ఫిర్యాదు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఏడుగురు మరణించిన ఘటనను, శ్రీకాకుళం జిల్లా గుర్లలో అతిసార మరణాలను ప్రస్తావిస్తూ.. దేశం మొత్తం ఏపీ వైపు చూడాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన జగన్, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా కేవలం ట్వీట్లతో సరిపెట్టుకోవడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదనే కారణంతో జగన్ తన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీని బహిష్కరించారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టే అత్యున్నత వేదిక సభ. అక్కడ పోరాటం చేయకుండా, ప్రజల గొంతుక వినిపించకుండా కేవలం మొబైల్ స్క్రీన్లకే పరిమితం కావడం వల్ల ఎవరికి లాభమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ ప్రజలకు ఏపీ సమస్యలను వివరించడం తప్పుకాదు కానీ, దేశం మొత్తం తన పనుల్లో తాను బిజీగా ఉంటుందని, ఏపీలోని కల్తీ పాల సమస్యపై దిల్లీ నుంచో లేదా ముంబై నుంచో ఎవరూ వచ్చి పోరాడరని ఆయన తెలుసుకోవాల్సిన ఉంది.
జగన్ కేవలం డిజిటల్ మాధ్యమాలనే నమ్ముకోవడం కేడర్‌ను కూడా గందరగోళానికి గురిచేస్తోంది. ట్వీట్లు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి లేదా ప్రజల మధ్య ఉండి ఆందోళనలు చేపట్టాలి అని సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంత అరాచకంగా ఉన్నా అక్కడ ప్రజలు, స్థానిక నాయకత్వమే పోరాడాలి తప్ప, కేవలం ట్యాగ్లు చేసి దేశం స్పందించాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది జగన్ ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ జగన్ మాత్రం.. ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తే ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదని అనుకుంటున్నారు.


