ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని ఏపీ గురించే ఆలోచిస్తున్నారు. రాష్ట్రం ఏమైపోతుందో అని దిగులు చెందుతున్నారు. అదే విషయాన్ని ఇంగ్లిష్ లో భారీగా చెప్పారు. తన సోషల్ మీడియా అకౌంట్ లో తన బాధనంతా వ్యక్తం చేశారు. కాగ్ రిపోర్టులను చూపిస్తూ. .. ఏపీ మొత్తం ఆదాయం ఆరు శాతం కన్నా ఎక్కువగా పెరగడం లేదని.. అదే సమయంలో అప్పులు పదమూడు శాతం పెరుగుతున్నాయని ఇలా అయితే ఎలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి వల్ల ఆదాయం తగ్గిపోతోందని ఆయన వేదనకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ తనకు కావాల్సిన వాటిని మాత్రమే తీసుకుని.. జగన్ మోహన్ రెడ్డి…ఫీలైపోతున్నారు. ఐదు సంవత్సరాల పాటు ఆయన చేసిన అప్పులకు కిస్తీలు కూడా ప్రస్తుత ప్రభుత్వమే కడుతుంది. ఆ విషయాలను మాత్రం చెప్పడం లేదు. మాట్లాడితే అప్పులు అంటారు . కానీ ఆ అప్పుల్లో అత్యధికం కేంద్రం నుంచి గ్రాంట్లుగా వస్తున్నాయి . ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. పోలవరం, అమరావతితో పాటు హంద్రీనీవా సహా అనేక ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నాయి. రోడ్లు, ఇంటింటికి కుళాయి వంటి అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత భారీగా మెరుగుపడిందో.. భవిష్యత్ లో ఏ స్థాయిలో ఉంటుందంటే.. రాబోయే కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ప్రకటించబోయే తాయిలాలే నిరూపిస్తాయి. ఐదేళ్లకూ.. పెన్షన్ పెంచలేదని మేనిఫెస్టోలో పెట్టిన ఆయన ఈ సారి .. ఎలాంటి హామీలిస్తారో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. చంద్రబాబు సంపద సృష్టి చేస్తే తాను పంచుతానని ఆయన చెప్పబోతున్నారు. అయినా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లుగా ట్ీట్లు చేస్తున్నారు.