వైసీపీలో జగన్ మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మే కొన్ని కులాల నేతలు ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతలు ప్రత్యర్థులపై చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు వారి స్వతహా నిర్ణయాలు కావని, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే జరుగుతున్నాయని తెలుస్తోంది. కులాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ లబ్ధి పొందాలనే జగన్ రెడ్డి వ్యూహం’లో భాగంగానే ఈ రెచ్చగొట్టే ధోరణి సాగుతోంది.
ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం పక్కా ప్లాన్
చంద్రబాబు వంటి కీలక నేతలను ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత దూషణలు కావు. సమాజంలో ఒక వర్గంపై మరో వర్గాన్ని ఉసిగొల్పేలా, తద్వారా దాడులకు పురిగొల్పేలా ఈ మాటలు ఉంటున్నాయి. ఒకవేళ ఇరువర్గాల మధ్య గొడవలు జరిగితే, దాని ద్వారా రాజకీయ మైలేజ్ పొందాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. జోగి రమేష్ వంటి వారు కూడా ఇదే తరహాలో దాడులు చేసినా పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరించడం వెనుక అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.
బాబాయ్ మార్క్ వ్యూహాలను ఎవరైనా కాదనగలరా?
ఈ రాజకీయ వ్యూహంలో భాగంగా రేపు ఆ నేతలకే ఏదైనా హాని తలపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దానికి తాజా ఉదాహరణే.. అంబటి రాంబాబు అరెస్టు తర్వాత ఆయన ఇంటిపై జరిగిన దాడి. అంబటి ఇంటిని తగులబెట్టింది సాక్షాత్తూ సత్తెనపల్లి వైసీపీ ఇంచార్జ్ అనుచరులేనని రావడం ఒక ప్రమాదకరమైన సంకేతం. వివేకానందరెడ్డి హత్య అంశంలో జరిగిన గూడుపుఠాణి అంతా తెలిసిన వారు దీన్ని తోసి పుచ్చలేరు.
వైసీపీ నేతల రక్షణ ప్రభుత్వంపై బాధ్యత
ఇలాంటి సంకుచిత రాజకీయాల వల్ల అంతిమంగా నష్టపోయేది జగన్ రెడ్డిని నమ్ముకున్న నేతలే. కాబట్టి, ప్రభుత్వం కేవలం శాంతిభద్రతల కోణంలోనే కాకుండా, రాజకీయ కుట్రల నుండి ఈ నేతలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుల ప్రచారాలు, కక్ష సాధింపులు తారాస్థాయికి చేరకముందే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. జగన్ వ్యూహాల బారి నుండి వైసీపీ నేతలను కూడా రక్షించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉంది.
