రివ్యూ: జైని ల‌వ్ చేసేద్దాం: జై ల‌వ‌కుశ‌

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

ఒక ఎన్టీఆర్ ఉంటేనే… తెర నిండుగా క‌నిపిస్తుంది
ఇద్ద‌రు ఎన్టీఆర్‌లు క‌లిస్తే… అదుర్సే!
ముగ్గురుంటే… మె.. మె.. మె మెస్మ‌రైజ్ అవ్వ‌కుండా ఏం చేస్తాం..?
స‌రిగ్గా ఈ ఆలోచ‌న నుంచే – జై ల‌వ‌కుశ క‌థ పుట్టుంటే క‌చ్చితంగా, నూటికి నూరుశాతం లెక్క త‌ప్పేసేది. ముగ్గురు ఎన్టీఆర్‌ల కోసం జై ల‌వ‌కుశ పుట్ట‌లేదు. క‌థ పుట్టాక ఎన్టీఆర్‌ని వెదుక్కొంటూ వెళ్లింది. అందుకే.. క‌థ‌ని ప‌ట్టుకొని ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌ని ప‌ట్టుకొని క‌థ‌… చ‌లాకీగా, చురుగ్గా న‌డిచేసింది. ఈ క‌థ‌కి ఎన్టీఆర్ లేక‌పోయినా.. ముగ్గురు ఎన్టీఆర్‌ల‌కు ఇలాంటి క‌థ దొర‌క‌పోయినా – జై ల‌వ‌కుశ రివ్యూలో మొద‌టి లైన్లు ఇలా ఉండేవి కావేమో! బ‌ల‌వంతుడికి చిన్న ఆస‌రా దొరికితే చాలు. ఎన్టీఆర్‌కీ అదే జ‌రిగింది. జై ల‌వ‌కుశ లాంటి రేఖామాత్ర‌మైన లైన్ ప‌ట్టుకొని ఎన్టీఆర్ బాక్సాఫీసు అనే ‘లంక’ని దాటేశాడు. అదెలా… చూద్దాం ప‌దండి.

* క‌థ‌

జై, ల‌వ‌, కుశ ముగ్గురూ క‌వ‌ల‌సోద‌రులు. ఒకేలా ఉంటారు. జైకి మిగిలిన ఇద్ద‌రంటే ప్రాణం. వాళ్ల‌లానే నాట‌కాల పిచ్చి. కానీ.. ఒక్క‌టే లోపం న‌త్తి. దాన్ని భూత‌ద్దంలో చూస్తూ మిగిలిన ఇద్ద‌రూ హేళ‌న చేస్తుంటారు. దానికి వ‌త్తాసు ప‌లికే మావ‌య్య (పోసాని) ఒక‌డు. నాట‌కాలు వేయాల‌న్న త‌ప‌న‌, ఇష్టం ఉన్నా – న‌…న‌… న‌త్తి వ‌ల్ల వేయ‌లేడు జై. ల‌వ‌, కుశ ఇద్ద‌రికీ ఊర్లో అభిమానం, ప్రేమ దొరికితే.. జై మాత్రం వాటికి దూరం అవుతాడు. జై ది ఎప్పుడూ తెర వెనుక పాత్రే! అమ్మ చ‌నిపోయాక మ‌రీ ఏకాకి అయిపోతాడు. అవ‌మాన భారంతో ర‌గిలిపోతాడు. ఆ కోపంతో… రంగ‌స్థ‌లం త‌గ‌ల‌బెట్టేస్తాడు. ఆ ప్రమాదంలో జై, ల‌వ‌, కుశ ముగ్గురూ విడిపోతారు. ల‌వ బ్యాంకు ఉద్యోగి. చాలా మంచోడు. అత‌నికి అన్నీ స‌మ‌స్య‌లే! ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంది. ఉద్యోగం కోల్పోయే ప‌రిస్థితి వ‌స్తుంది. ఈలోగా.. కారు ప్ర‌మాదం జ‌రుగుతుంది. అక్క‌డే కుశ బ‌తికున్నాడ‌ని తెలుస్తోంది. కుశ ప‌ర‌మ స్వార్థ ప‌రుడు. దొంగ‌. త‌న స్వార్థం కోసం ల‌వ స్థానంలో బ్యాంకు ఉద్యోగిగా వెళ్తాడు. త‌న ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టుకొని అక్క‌డి నుంచి చెక్కేద్దాం అనుకొనేలోగా… వీరిద్ద‌రి జై ఎత్తుకెళ్తాడు. ఇంత‌కీ జై ఎక్క‌డున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇన్నాళ్ల త‌ర‌వాత ల‌వ‌,కుశ‌ల అవ‌స‌రం ఏమొచ్చింది?? అనేదే మిగిలిన క‌థ‌

* విశ్లేష‌ణ‌

అంత గొప్ప క‌థేం కాదు. కానీ తీసి పారేయాల్సిన క‌థా కాదు. జై, ల‌వ‌, కుశ మూడు పాత్ర‌ల చుట్టూ ఓ క‌థో, సంఘ‌ర్ష‌ణో, ప‌గో, కోప‌మో క‌నిపించ‌డానికి కావ‌ల్సిన బేస్ మాత్రం ఈ క‌థ‌లో ఉంది. అందుకే… సినిమా అక్క‌డ‌క్క‌డ నీర‌సంగా సాగినా.. క‌థ‌లో సోల్ ఉండ‌బ‌ట్టి – చేస్తోంది ఎన్టీఆర్ కాబ‌ట్టి – గుడ్ల‌ప్ప‌గించి చూస్తుండిపోతాం. చిన్న‌ప్ప‌టి ఎపిసోడ్ల నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. 20 నిమిషాల పాటు వాటితోనే సినిమాని న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే కుతూహంలో కూర్చున్న స‌గ‌టు ఎన్టీఆర్ అభిమానికి ఆ కాసేపూ ప‌రీక్షే. కాక‌పోతే క‌థ‌కు ఆ ఎపిసోడ్లు అవ‌స‌రం కాబట్టి ఓపిగ్గా కూర్చోవాలి. ల‌వ‌, కుశ‌ల‌ని చూపించి, వాళ్ల మ‌ధ్య క‌థ న‌డిపిస్తూ ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ తీసుకొచ్చాడు. తెర‌పై ఇద్ద‌రు ఎన్టీఆర్‌లు ఉన్నా – సినిమా ముందుకు సాగుతున్న‌ట్టు అనిపించ‌దు. ల‌వ‌కుమార్ ట్రాక్ పెద్ద ద‌వ‌డం, అది కాస్తా… అతి మంచిత‌నంతో నిండిపోవ‌డం నిరుత్సాహ‌ప‌రిచే విష‌యాలు. జై హుషారు తెప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. కోటి రూపాయ‌ల బ్యాంకు రుణం రాబ‌ట్ట‌డానికి కుశ చేసిన ఫీట్లు, 5 వేల నోట్ల ఎపిసోడ్ కాస్త గ‌ట్టెక్కిస్తాయి. కాక‌పోతే ఒక‌టి మాత్రం నిజం. జై పాత్ర ఎంట్రీ వ‌ర‌కూ…. క‌థ న‌త్త‌న‌డ‌క న‌డుస్తూనే ఉంటుంది. జై వ‌చ్చాక ఆ ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. జై ఎంట్రీ… అ… అ.. అదుర్స్ అనాలంతే! జై పాత్ర‌ని ఏ రేంజ్‌లో చూపించాలో ఆ రేంజులో చూపించారు. విరామం అన‌కుండా ‘రావ‌ణం’ అని ఇంట్రవెల్ కార్డు వేసిన‌ప్పుడే.. జై పాత్ర‌లో ఎన్టీఆర్ ఎంత రెచ్చిపోబోతున్నాడో హింట్ ఇచ్చేశాడు ద‌ర్శ‌కుడు.

ద్వితీయార్థాన్ని పూర్తిగా త‌న భుజ స్కంధాల‌పై వేసుకొని న‌డిపించాడు జై. జై ఉన్నంత సేపూ ఏ పాత్రా క‌నిపించ‌దు. ఆఖ‌రికి ల‌వ‌, కుశ‌లు కూడా. హీరోయిన్లు కూడా సైడ్ అయిపోవాల్సిందే. ద్వితీయార్థంలో క‌థానాయిక‌లు పూర్తిగా డ‌మ్మీలుగా మారిపోయారు. జై త‌న ఎదుగుద‌ల‌కు ల‌వ‌, కుశ‌ల‌ను వాడుకొనే ఎపిసోడ్లు, రావ‌ణాసురుడి ఇంట్లో జరిగే విషయాలు ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా తీసుంటే బాగుండేది. క‌నీసం ఒక్క‌టంటే ఒక్క సీన్‌లో రావ‌ణ‌గా జై విశ్వ‌రూపం చూపిస్తే బాగుండేది. ప్రీ క్లైమాక్స్లో నాట‌కాల ఎపిసోడ్ వ‌ర‌కూ సినిమాలో విష‌యం లేకుండా చేశాడు ద‌ర్శ‌కుడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్న‌ట్టు… ఆ స‌మ‌యాన్ని నింప‌డానికి చేసే ప్ర‌య‌త్నాల్లానే క‌నిపిస్తాయి. ముగ్గురు ఎన్టీఆర్‌లూ క‌ల‌సి నాట‌కం వేసే ఎపిసోడ్‌ని ఈ క‌థ‌కు బాగా వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. క‌థ తాలుకూ ఎమోష‌న్‌, సోల్ అక్క‌డ బ‌య‌ట‌ప‌డ్డాయి. అలాంటి సీన్ సెకండాఫ్‌లో మ‌రోటి ఉండుంటే… ల‌వ‌కుశ రేంజ్ మ‌రోలా ఉండేది. క్లైమాక్స్ లో ఎమోష‌న్ డోస్ ఎక్కువైంది. కాక‌పోతే.. ఈ సినిమాకి ఇలాంటి క్లైమాక్సే క‌రెక్ట్ అనిపిస్తుంది. జై పాత్ర‌పై సానుభూతి క‌చ్చితంగా సినిమాకి హెల్ప్ చేసేదే.

* న‌టీన‌టులు

ఈ సినిమాలో, క‌థ‌లో లోపాలున్నా.. దాన్ని ఎన్టీఆర్ డామినేట్ చేస్తూ, మ‌ర్చిపోయేలా చేయ‌గ‌లిగాడు. ఎన్టీఆర్ కాకుండా మ‌రో న‌టుడు తెర‌పై ఉంటే.. క‌నీసం ఈ సినిమా గురించి మాట్లాడుకొనే అవ‌స‌రం కూడా ఉండ‌దేమో. జై ల‌వ‌కుశ అంటే ఎన్టీఆర్‌.. అంతే! అంత‌కు మించి ఎన్టీఆర్ కోసం ఏం చెబుతాం. జై పాత్ర ఎమోష‌న్ అయ్యే సంద‌ర్భంలో అస‌లు సిస‌లు న‌టుడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. కుశ కాస్త ఓవ‌ర్ చేసిన‌ట్టు అనిపిస్తుంది. ఒకే న‌టుడు మూడు పాత్ర‌లు పోషిస్తున్న‌ప్పుడు వేరియేష‌న్స్ చూపించాల్సివ‌చ్చిన‌ప్పుడు.. ఇలాంటి ఓవ‌ర్ డోసులు త‌ప్ప‌వేమో. రాశీఖ‌న్నా, నివేదాలే కాదు.. మిగిలిన అన్ని పాత్ర‌ల్నీ జై డామినేట్ చేసుకొంటూ వెళ్లాడు. పెళ్లి చూపులు ప్రియ‌ద‌ర్శి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.

* సాంకేతిక వ‌ర్గం

దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు… త‌న స్థాయిలో లేవు. ఐటెమ్ పాట‌ల్ని అద‌ర‌గొట్టే దేవి.. స్వింగ్ పాట‌లో ద‌మ్ము చూపించ‌లేక‌పోయాడు. కాక‌పోతే ఆ పాట‌లో త‌మ‌న్నా వేసిన స్టెప్పులు ఆక‌ట్టుకొంటాయి. నేప‌థ్య సంగీత ప‌రంగా ఎక్కువ మార్కులు పడ‌తాయి. రావ‌ణ పాట‌ని స‌మ‌ర్థంగా వాడుకొన్నాడు. ఒక్కోచోట త‌న ఆర్‌.ఆర్‌తోనే సీన్‌ని ఎలివేట్ చేశాడు. బాబి అనుకొన్న లైన్ బాగుంది. స్క్రీన్ ప్లేలో స్పీడు పెరిగితే బాగుణ్ణు. మాట‌ల్లో ఛ‌మ‌క్కులు న‌చ్చుతాయి. ప్రేమ పావురాలు చూస్తూ… అందులో పావురాల్ని ఎత్తుకెళ్తే ఎంతొస్తుంద‌ని ఆలోచించాను కానీ, ప్రేమ గురించి ఆలోచించ‌లేదు.. లాంటి మెరుపులు క‌నిపిస్తాయి. చోటా ఈ సినిమాని కల‌ర్ ఫుల్‌గా తీర్చిదిద్దాడు. సినిమాని త‌క్కువ‌లో తీసిన‌ట్టు అర్థ‌మ‌వుతున్నా – చోటా వ‌ర్క్ వ‌ల్ల భారీ సినిమాలానే క‌నిపిస్తుంది.

* ఫైన‌ల్ ట‌చ్‌: రావ‌ణా… జై.. జై.. జై

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.