బెంగాల్లో మమతా బెనర్జీ ఘోర ఓటమికి కారణం ఏమిటి.. ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. గెలిచింది కాబట్టి బీజేపీ గురించి చాలా మంది మాట్లాడుతూంటారు. వారికి సక్సెస్ ఫుల్ వ్యూహాలంటారు. కానీ మమతా బెనర్జీ రాజకీయం చేయకుండా.. ఆ పనిని ఐ ప్యాక్ కు అప్పగించడం వల్లనే ఓడిపోయిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. దశాబ్దాలుగా క్షేత్రస్థాయి పోరాటాలతో, సొంత ప్రజాకర్షణతో ఎదిగిన దీదీ మమతా బెనర్జీ.. తన రాజకీయ చతురతను పక్కనబెట్టి, పూర్తిగా ‘ఐ-ప్యాక్’ వంటి కార్పొరేట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థను నమ్ముకోవడం వల్లే ఈ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారన్నది నిజం.
ఐ ప్యాక్ పైనే నమ్మకం ఉంచిన దీదీ
రాజకీయ పార్టీని కార్పొరేట్ స్టైల్లో నడపడం, కేవలం సర్వేలు, డేటా మేనేజ్మెంట్లకే ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్ కాంగ్రెస్ సాంప్రదాయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే సీనియర్ నాయకులను, నమ్మకమైన కేడర్‌ను పక్కనబెట్టి.. ఐ-ప్యాక్ ప్రతినిధులు ఇచ్చిన ఏకపక్ష నివేదికల ఆధారంగా టికెట్లు కేటాయించడం తీవ్ర అసంతృప్తికి దారితీసిందని టీఎంసీ లోక్‌సభ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీ వంటి అగ్రనేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. “ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసింది” అంటూ సొంత పార్టీ నేతలే ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు.
రాజకీయాలకు కార్పొరేట్ టచ్ పనికి రాదు!
రాజకీయాల్లో అవినీతి సొమ్ము తో కార్పొరేట్ తరహాలో ఈవెంట్ మేనేజ్మెంట్ రాజకీయాలు నడపడం తాత్కాలికంగా విజయాలను అందించవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో పార్టీ ఉనికికే ప్రమాదకరమని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఐ-ప్యాక్ తెచ్చిన సంస్కృతి వల్ల క్షేత్రస్థాయిలో నాయకులకు, ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయాయి. ఇరవై, ముప్పై ఏళ్ల వయసున్న ఐ-ప్యాక్ అసోసియేట్లు చెప్పిన స్క్రిప్ట్‌లనే సీనియర్ నేతలు అనుసరించాల్సి రావడం, టికెట్ల పంపిణీలో సైతం వారి మాటే వేదంగా మారడం వల్ల.. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన మమతా బెనర్జీని ఈ వ్యూహకర్తలు చివరకు జీరో స్థానానికి తీసుకువచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐ ప్యాక్‌కు డబ్బులు.. మమతాబెనర్జీకి ఓటమి
భారతీయ రాజకీయాల్లో సొంతంగా ఎదిగిన నేతలకు ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తోంది. ప్రజల్లో ఉంటూ, ప్రజా ఉద్యమాల ద్వారా పైకి వచ్చిన మమతా బెనర్జీ వంటి నేతలు.. తమ స్వయంశక్తిని, సొంత రాజకీయ వివేకాన్ని వదిలేసి ఇలాంటి ప్యాకేజీ వ్యూహకర్తలను గుడ్డిగా నమ్ముకుంటే అంతిమంగా మట్టి కరిచిపోవడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ విశ్లేషిస్తున్నాయి. సిద్ధాంతాలు, నిబద్ధత లేని కార్పొరేట్ సంస్థలు కేవలం వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తాయని, ఎన్నికల ఓటమి తర్వాత ఆ సంస్థలు సులభంగా తప్పుకుంటాయని, నష్టపోయేది మాత్రం దశాబ్దాల చరిత్ర గల నేతలేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
