తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. రాజకీయ చైతన్యం ఎప్పుడూ ఎక్కువే. కానీ, అదే చైతన్యాన్ని సాకుగా తీసుకుని ప్రజల భావోద్వేగాలను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్న పార్టీల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ రాజకీయాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలతో ప్రారంభమైన రాజకీయం ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అంటూ ఏపీ నేతల్ని తిట్టడం ప్రారంభించారు. ఆయన చేసిన వ్యాఖ్యల కంటే, దానికి ప్రతిగా ఏపీలో నమోదైన కేసులు, అక్కడి నేతల స్పందనను తెలంగాణలో కొందరు నేతలు ప్రాంతీయ ఆత్మగౌరవ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అంటే.. రోజూ కొంత మందిని ఆన్ లైన్, ఆఫ్‌లైన్‌లోకి పంపించి బూతులు తిట్టించడమే.
ప్రజలు టేకిట్ గ్రాంటెడ్ కాదు
నాగేశ్వర్ ఒక విశ్లేషకుడు, ఆయన వ్యాఖ్యలు తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే.. ఆ వివాదాన్ని సాకుగా చూపి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను దూషించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించవచ్చ భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలను రోడ్ల మీదకు తీసుకురావడం చాలా సులువని, భావోద్వేగపూరిత నినాదాలు ఇస్తే చాలని నేతలు అనుకుంటున్నారు. కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది. తెలంగాణ సాధించిన తర్వాత ఇక్కడి ప్రజల ప్రాధాన్యతలు మారాయి. ఇప్పుడు వారికి కావాల్సింది అభివృద్ధి, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు. కేవలం ఆంధ్రా నేతలు అనే పాత నినాదంతో మళ్లీ గొడవలు సృష్టించాలని చూస్తుంటే, ప్రజలు దానిని తిరస్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా తప్ప, క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు ఈ సెంటిమెంట్ రాజకీయాలను పట్టించుకోవడం లేదు.
రాజకీయ పార్టీల భ్రమ
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించడం ద్వారా తెలంగాణలో రాజకీయ పట్టు సాధించవచ్చనే భ్రమలో కొన్ని పార్టీలు ఉన్నాయి. ప్రత్యేకించి బీఆర్ఎస్ వంటి పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఈ విషయంలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో విభజన రాజకీయాలకు తెరలేపుతున్నాయి. అయితే, ప్రజలు ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలను ఒక రకమైన ఏహ్యభావంతో చూస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తమను పావులుగా వాడుకుంటున్నారనే స్పృహ తెలంగాణ పౌరుల్లో బలంగా కనిపిస్తోంది.
తెలియాల్సింది నేతలకే
ప్రజలకు అన్నీ తెలిసిపోయాయి. ఎవరు ఏ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారో, ఎవరు గొడవలు పెట్టాలని చూస్తున్నారో పసిగట్టేంత అవగాహన నేటి ఓటరుకు ఉంది. అందుకే రోడ్ల మీదకు వచ్చి రెచ్చిపోవాలని పిలుపునిచ్చినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. ఇప్పుడు మారాల్సింది, విషయాలను తెలుసుకోవాల్సింది రాజకీయ నాయకులే. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను ప్రయోగశాలగా మార్చుకోవాలని చూస్తే, అది అంతిమంగా ఆ పార్టీలకే నష్టం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ గౌరవాన్ని కాపాడటం అంటే ఏపీ నేతలను తిట్టడం కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం. రాజకీయ పార్టీలు ఈ వాస్తవాన్ని గ్రహించి, కృత్రిమ సెంటిమెంట్ల కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెడితేనే మనుగడ సాగించగలవు.
