ఇప్పుడు దాదాపు ప్రతి సినిమాకీ పార్ట్ 2 ట్రెండ్ నడుస్తోంది. అయితే చాలా సినిమాలు ఫలితాలపై ఆధారపడి సీక్వెల్ ప్లాన్లు డ్రాప్ అవుతుంటాయి. సినిమా ప్రమోషన్స్‌లో హీరో, దర్శకుడు, నిర్మాతలు “పార్ట్ 2 అవకాశముంది, కానీ ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి వుంది” అని చెబుతారు. కానీ జటాధర విషయంలో మాత్రం ప్రేరణ అరోరా సినిమా రిజల్ట్‌కి సంబంధం లేకుండా పార్ట్ 2 ఆలోచనలు ముందే ప్రారంభించడం సినిమాపై ఆమెకున్న కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి.
‘రుస్తుం’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్‌మ్యాన్’,‘పరి’ లాంటి విజయవంతమైన బాలీవుడ్ సినిమాలను నిర్మించిన ప్రేరణ అరోరా, ఇప్పుడు సుధీర్ బాబుతో చేసిన జటాధర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ వారంలోనే థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా రిలీజ్ కాకముందే నిర్మాత ప్రేరణ అరోరా జటాధర పార్ట్ 2 ను ఫిక్స్ చేశారు.
“జటాధరను ఫ్రాంచైజ్‌గా ప్లాన్ చేస్తున్నాం. ఫలితంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేస్తాం. ఇది ఘోస్ట్ హంటింగ్ నేపథ్యంలో నడిచే కథ. ఇందులో ధనపిశాచి లాంటి ఆత్మను చూపిస్తున్నాం. మరో సినిమాలో మరో ఆత్మకథను చూపిస్తాం. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తాం”అని చెప్పారు
అన్నట్టుగానే ‘జటాధర’ క్లైమాక్స్ లో కూడా పార్ట్ 2కి లీడ్ ఇవ్వబోతున్నారు. ఈసారి సోనాక్షి సిన్హా కాకుండా మరో స్టార్ హీరోయిన్ తో ఈ ఫ్రాంచైజీ కొనసాగే అవకాశం ఉంది. హీరోగా మాత్రం సుధీర్ బాబునే నటిస్తారని టాక్. ‘ప్రేమకథా చిత్రమ్’ ఫ్రాంచైజీని కొనసాగించాలని సుధీర్ బాబుకి ఎప్పటి నుంచో వుంది. కాకపోతే ఈ విషయంలో ముందడుగు వేయాల్సింది సుధీర్ బాబు కాదు.. మారుతి. ఆయనేమో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరి ఈ ఫ్రాంచైజీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
