తెలంగాణ రాష్ట్ర యంత్రాంగంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి జయేష్ రంజన్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. వాస్తవానికి ఆయన గతేడాది ఆగస్టులోనే రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం ఏడు నెలల పొడిగింపు ఇచ్చింది. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండటంతో, తదుపరి సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పేరు దాదాపు ఖరారైనట్లు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
కేటీఆర్ కారణంగా కేసులో ఇరుక్కున్న అర్వింద్ కుమార్
సీనియారిటీ పరంగా చూస్తే జయేష్ రంజన్ కంటే ముందు అర్వింద్ కుమార్ వంటి అధికారులు ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలు ఆయన అవకాశాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా-ఈ రేసు నిర్వహణ కోసం సుమారు రూ.55 కోట్ల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి తరలించారనే ఆరోపణలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేటీఆర్ నోటి మాట ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో ఆ కేసు మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ఆయనపై ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి ఇవ్వడం, ఏసీబీ చార్జిషీట్ దాఖలుకు సిద్ధమవ్వడంతో ఆయన పేరు పరిశీలించడం సాధ్యం కాదు.
కాంగ్రెస్ ప్రభుత్వంతో అలసిపోయిన జయేష్ రంజన్
జయేష్ రంజన్ బీఆర్ఎస్ హయాంలో పదేళ్లుగా ఐటీ, పరిశ్రమల శాఖల్లో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ అధినేతలకు సన్నిహితంగా ఉన్నారనే పేరున్నప్పటికీ, రేవంత్ రెడ్డి సర్కారులోనూ అంతే వేగంగా కలిసిపోయారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలతో పాటు జీహెచ్ఎంసీ విభజన వంటి కీలక అంశాలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నమ్మకస్తుడైన అధికారిగా మారారు. ఆయనకున్న క్లీన్ ఇమేజ్, పాలనాపరమైన అనుభవం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద సంపాదించిన విశ్వాసం ఆయనను సీఎస్ రేసులో అందరికంటే ముందు నిలబెట్టాయి.
వివాదాలు లేని అధికారి జయేష్
1992 బ్యాచ్‌కు చెందిన జయేష్ రంజన్, ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి కావడమే కాకుండా సివిల్ సర్వీసెస్ టాపర్‌గా కూడా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలోనూ, ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించడంలోనూ ఆయనది కీలక పాత్ర. వివాదరహితుడైన అధికారిగా పేరుండటం, పాలనలో కొనసాగింపు ఉండాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, మార్చి నెలాఖరులో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
