జేసీ మంత్రి కాలేరు.. జ‌గ‌న్ సీఎం కాలేరు..!

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మాట‌ల గురించి ప్ర‌త్యేకంగా ఇంట్రొడ‌క్ష‌న్ ఇవ్వాల్సిన ప‌నిలేదు. ఆయ‌న అధికార ప‌క్షంలో ఉంటూనే విప‌క్ష పాత్ర కూడా పోషించేస్తుంటారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని అమాంతంగా ఆకాశానికి ఎత్తేయాల‌న్నా, అంతే వేగంగా కిందికి దించేయాల‌న్నా ఆయ‌న‌కే చెల్లు అనుకోవాలి. తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఆయ‌న ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. దీన్లో టీడీపీలో త‌న‌కు ద‌క్కుతున్న గుర్తింపు గురించి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తు దృష్ట్యా ఆలోచిస్తే దూర‌దృష్టి క‌లిగిన నాయ‌కుడు ఒక్క చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే అని జేసీ వ్యాఖ్యానించారు. రాజ‌కీయ నాయ‌కుల‌కు మంత్రి ప‌ద‌వి అనేది చాలా ముఖ్య‌మైన‌దనీ, అదే లక్ష్యమని అన్నారు. త‌మకు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ర‌నేది తెలుసు అన్నారు. దానికి ఎన్నో కార‌ణాలున్నాయ‌నీ, అవేంటో చెప్పాల్సిన పనిలేదనీ, త‌న న‌మ్మ‌కం ప్ర‌కారం త‌న‌కు ప‌ద‌వి రాద‌ని స్ప‌ష్టం చేశారు! కౌన్సిల‌ర్లు కూడా కాలేనివారికి మంత్రి ప‌ద‌వులు చంద్ర‌బాబు క‌ట్ట‌బెట్టార‌న్నారు. త‌న త‌మ్ముడికి మాత్రం ఇవ్వ‌లేద‌న్నారు. ‘మంత్రి ప‌ద‌వి రావాలంటే సీఎంకి న‌చ్చాలి, మేము న‌చ్చ‌లేదు. ఎందుకూ అని అడ‌గ‌లేదు. ప‌ద‌వి కావాల‌ని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు’ అన్నారు జేసీ. ఒక ఎంపీగా త‌న‌ను పార్టీలో క‌రివేపాకులా వాడుకుంటున్నార‌న్నారు. ఎంపీల అంద‌రి ప‌రిస్థితి దాదాపుగా ఇంతే అన్నారు.

ఇక‌, ప్ర‌తిప‌క్ష నాయుడు జ‌గ‌న్ గురించి జేసీ మాట్లాడుతూ… చంద్ర‌బాబుతో పోటీప‌డే నాయ‌కుడు జ‌గ‌న్ అనీ, కానీ ఆయ‌న‌లో ఆ స్ఫూర్తి లేద‌న్నారు. విజ‌న్‌, ప‌ట్టుద‌ల కనిపించడం లేద‌ని చెప్పారు. జగ‌న్ పాద‌యాత్ర‌కు జ‌నం వ‌స్తున్న తీరుపై ఆయ‌న స్పందిస్తూ.. జ్యోతిల‌క్ష్మిని పంపిస్తే జ‌నం ఎట్టొస్తారో తెలుస్తుంద‌ని ఎద్దేవా చేశారు. జ‌నం వ‌స్తే ఓట్లేస్తారా, ఆ లెక్క‌న చిరంజీవికి ఎంతమంది జ‌నం వ‌చ్చార‌నీ, మొన్న ఓ సినిమా యాక్ట‌ర్ ఏడికోపోతే రోడ్ల‌న్నీ జామ్ అయిపోయాయి అని జేసీ చెప్పారు. జ‌గ‌న్ ఎప్ప‌టికీ ముఖ్య‌మంత్రి కాలేర‌ని జేసీ జోస్యం చెప్పారు. ఇక‌, పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇస్తున్న హామీల గురించి మాట్లాడుతూ.. రుణ‌మాఫీ, వెయ్యి రూపాయాల ఫించెన్ల‌ను అమ‌లు చేయ‌డం కోసం చంద్ర‌బాబు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారని అన్నారు. ఇవ‌న్నీ ప్రాక్టిక‌ల్ గా చూస్తున్నానని చెప్పారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి తెలుగుదేశం అధికారంలోకి వ‌స్తుంద‌నీ, చంద్ర‌బాబు నాయుడే ముఖ్య‌మంత్రి అవుతార‌ని కూడా ఈ సంద‌ర్భంగా జోస్యం చెప్పారు. భ‌విష్య‌త్తులో అన్నిసార్లూ టీడీపీ గెలుస్తుంద‌ని తాను చెప్ప‌నుగానీ, జ‌గన్ ముఖ్య‌మంత్రి కావ‌డం సాధ్యం కాద‌ని మ‌రోసారి కూడా జేసీ చెప్పారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ర‌నీ, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాలేర‌నే విష‌యాల‌పై జేసీ చాలా స్ప‌ష్టంగా అభిప్రాయ‌ప‌డ‌టం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.