కెటిఆర్‌ దాటేసినా మెట్రో రేట్లే చర్చే

హైదరాబాద్‌ మెట్రో ప్రారంభోత్సవం చేరుకుందంటే మంత్రి కెటిఆర్‌ పాత్రను ప్రత్యేకంగా చెప్పుకోవలసి వుంటుంది. తన తండ్రి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏవో కారణాలతో ఆమోదిత ప్రణాళికకు అభ్యంతరాలు చెప్పి ఆలస్యం చేస్తుంటే ఆయన వెంటనే రంగంలోకి దిగి అంతా సర్దుబాటు చేశారు. ఈ సర్దుబాటుపై సహజంగానే వ్యాఖ్యలు విమర్శలు వున్నా అర్థంతరంగా మెట్రోను ఆపడం అర్థంలేని పని గనక వేగవంతం చేయడమే మెరుగైనపని. దశల వారిగా మెట్రోను పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ వచ్చారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పిపిపి నమూనాలో 30 కిమీ మెట్రో ఒక్కవిడతనే ప్రారంభం కావడం హైదరాబాద్‌ ఘనతే. ఇప్పుడు ప్రధాని ప్రారంభించేముందు కెటిఆర్‌ మీడియాతో మంత్రులతో కలసి పర్యటించారు. చాలా విషయాలు చెప్పారుగాని ఛార్జీల మాట దాటేశారు. ఒప్పందం ప్రకారం ఆ ప్రకటన మెట్రో నిర్మించిన ఎల్‌అండ్‌టి నుంచే రావాలని చెప్పారు. మీడియా మిత్రులు ఒకటికి రెండుసార్లు రెట్టించినా మిగిలిన వారికంటే మెరుగ్గా వుంటాయని మాత్రమే చెప్పడం తప్ప వివరాల్లోకి వెళ్లలేదు. అయితే ఎల్‌అండ్‌టి విడుదల చేసిన వివరాల ప్రకారం కనీస ఛార్జి 10 రూపాయలు గరిష్ట చార్జి 60రూపాయలు వుంది. ఇది దేశంలో మిగిలిన చోట్లకంటే ఎక్కువగా వుందని కెటిఆర్‌ వార్తతో పాటే చర్చ మొదలైంది. ఆర్టీసీ అధికారులు కూడా తమ బస్సుల్లో ఇంతకంటేచాలా చౌకగా ప్రయాణం చేయొచ్చని పోలిక చేశారు. మరో వైపున ఆర్టీసీ ఎసి బస్సులతో పోలిస్తే మెట్రో చౌక అని కొందరు ప్రయాణీకులు అభిప్రాయం వెలిబుచ్చారు. ఆలస్యం పేరిట ఎల్‌అండ్‌టికి 300 కోట్లపైన భారం పడిందంటూ నిర్వహణలో నిర్మాణాలలో అదనపు ఆదాయం, అవకాశాలు కల్పించడం మాత్రం కనిపిస్తున్న సత్యమే. అయితే నగర జనాబాలో ఒక భాగం నిజంగా సౌఖ్యంగా వుంటే ఈ భారం మోసైనా మెట్రోను ఉపయోగించుకోవడానికి ఇష్టపడొచ్చు. కాని ఆ స్టేషన్లనుంచి రాకపోకలకు వాహనాలు పార్కింగ్‌ వసతి మాత్రం తప్పనిసరి. అవి ఇంకా చాలా వరకూ సమకూరలేదు. ప్రారంభంలో వచ్చే సమస్యలను పెద్దవి చేయొద్దని కెటిఆర్‌ మీడియాకు పరోక్ష సూచనలు చేశారు గాని ఒకసారి మొదలైతే అవన్నీ ఎలాగూ ముందకొస్తాయి. సమస్యలున్నా వ్యవస్థను ఎవరూ కాదనుకోరు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.