జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకోలేదు. బీఆర్ఎస్ తరపున విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీగా నామినేషన్ వేయడం కలకలం రేపింది. కానీ చివరికి మాగంటి సునీత నామినేషన్ ఆమోదం పొందడంతో ఆయన నామినేషన్ బీఫాం లేని కారణంగా తిరస్కరణకు గురయింది.ఇప్పుడు ఎంత మంది పోటీలో ఉన్నా సరే.. ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. కానీ అది పైకే. అసలు పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కేంద్రీకృతమవుతోంది.
సానుభూతే అస్త్రం -కేసీఆర్ వ్యూహాలే బలంగా బీఆర్ఎస్
భారత రాష్ట్ర సమితి జూబ్లిహిల్స్ ఉపఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తమ కమ్ బ్యాక్ కు జూబ్లిహిల్స్ నుంచే మొదటి అడుగు పడుతుందని నమ్మకంతో ఉంది. అందుకోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో రిస్క్ తీసుకోలేదు. సానుభూతినే నమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో కేసీఆర్ వ్యూహాలపై వారికి నమ్మకం ఉంది.కేసీఆర్ కూడా ఈ ఉపఎన్నికపై స్టడీ చేశారు. వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. గురువారం పార్టీ నేతలు, ఎన్నికల ఇంచార్జులకు క్లాస్ తీసుకోనున్నారు. ఏ ఏరియాలో ఎలా వ్యవహరించాలో చెప్పనున్నారు. కేసీఆర్ స్ట్రాటజీలపై బీఆర్ఎస్ మరింత నమ్మకంగా ఉంది.
మజ్లిస్ సపోర్ట్ .. అధికారమే అడ్వాంటేజ్‌గా కాంగ్రెస్
గత పదేళ్లకాలంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డిపాజిట్లు కూడా దక్కించుకున్న పాపాన పోలేదు. సిట్టింగ్ సీట్లలోనూ ఘోర పరాజయాలు పాలయ్యారు ఆ పార్టీ అభ్యర్థులు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికల్లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. దీనికి కారణం కాలం కూడా కలసి రావడమే. మజ్లిస్ పార్టీ మద్దతు ఇవ్వడం గేమ్ ఛేంజర్. జూబ్లిహిల్స్ లో మైనార్టీ ఓట్లు లక్ష వరకూ ఉంటాయి. వారు అత్యధికంగా మజ్లిస్ చెప్పినట్లుగా వింటారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్, బీఆర్ఎస్ బలహీనపడటం కూడా కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చేదే. పైగా అభ్యర్థి నవీన్ యాదవ్ కు వ్యక్తిగత బలం ఉంది. అందుకే కాంగ్రెస్ మరింత నమ్మకంగా ఉంది.
బీజేపీ .. ఇంత మాత్రం దానికి పోటీ చేయడం ఎందుకో ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల విషయంలో బీజేపీ మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపించలేదు. అభ్యర్థిని కూడా నామినేషన్లు ప్రారంభమైన తర్వాత ఖరారు చేశారు. ఆ అభ్యర్థి ఎవరయ్యా అంటే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన లీడరే. మరి అలాంటి పరిస్థితుల్లో ముందే పేరు ప్రకటిస్తే ప్రచారం చేసుకునేవారు కదా అంటే సమాధానం ఉండదు. బండి సంజయ్.. కాంగ్రెస్ కు మరింత సాయం చేస్తున్నారు. ఆయన నామినేషన్ల కార్యక్రమంలో జూబ్లిహిల్స్ పెద్దమ్మగుడి స్థలాన్ని మజ్లిస్ కు ఇస్తారంటూ మాట్లాడారు. ఆయన మాటల ద్వారా మైనార్టీల ఓట్లు మరింతగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఇది బీజేపీని మరింతగా నష్టపరుస్తుంది.
మొత్తంగా… జూబ్లిహిల్స్ పోరాటం ముఖాముఖిగా మారిందని అనుకోవచ్చు.