జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఓ పెద్ద సమస్యను పరిష్కరించుకోవడానికి దారి చూపిస్తోంది. ఆ సమస్య స్థానిక ఎన్నికలు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి నెలా.. వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్వహించడానికి ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో వచ్చిన అనూహ్య విజయంతో రేవంత్ రెడ్డి ఇదే ఊపుతో ఆ ఎన్నికలనూ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నారు.
మరో వారం పది రోజుల్లో స్థానిక ఎన్నికలు
కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ..న్యాయపరమైన చిక్కులు ఉన్నందున ఎన్నికల నోటిఫికేషన్ లో హైకోర్టు, సుప్రీంకోర్టు కోర్టు సూచించినట్లుగా యాభై శాతం రిజర్వేషన్లతో మార్పులు చేసి ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గతంలో నోటిఫిషన్ రిలీజ్ రోజునే హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ సారి రిజర్వేషన్ల మార్పులు ఉంటాయి కాబట్టి మరికొంత సమయం ఇచ్చి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి వేగంగా పూర్తి చేయనున్నారు. ఎక్కడా ఎలాంటి గ్యాప్ ఉండకుండా చూసుకోనున్నారు.
పార్టీ పరమైన రిజర్వేషన్లే
చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదు కాబట్టి.. రాజకీయ పరంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పనున్నారు. న్యాయపరమైన ప్రక్రియ వల్ల ఆలస్యం అవుతోంది కాబట్టే ఈ నిర్ణయం అని.. అందుకే నష్టం జరగకుండా పార్టీ పరంగా 42 శాతం స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెడుతున్నామని ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఇతర పార్టీలు కూడా అలాగే చేయాలని సవాల్ చేయనున్నారు. ఇప్పటికే ఆయా స్థానాకు రిజర్వేషన్లకు తగ్గ అభ్యర్థులను ఖరారు చేసుకున్నారు. అందుకే అన్ని పార్టీలూ ఈ విషయంలో 42 శాతం సీట్లు బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది.
ఇదే ఊపులో అయితే పాజిటివ్ ఫలితాలు
స్థానిక ఎన్నికల్లో పూర్తిగా అధికార పార్టీ హవా ఉంటుందని చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత అని ..మరొకటని ప్రచారం జరిగినా.. ఇప్పుడు ప్రజలు పూర్తిగా మారిపోయారని.. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్లరని అనుకుంటున్నారు. సంక్షేమ పథకాల లబ్ది పల్లె ప్రజలకు ఎక్కువగా జరిగిందని రేవంత్ కూడా భావిస్తున్నారు ఈ విషయంలో ఇక వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది.
