మాట్లాడని వారిని వదలి, ఆయనపై ధ్వజం?

టాలివుడ్‌ను కుదిపేస్తున్న లైంగిక దోపిడీ సమస్యపై శ్రీరెడ్డి మొదలుపెట్టిన పోరాటాన్ని సమాజం మీడియా బలపర్చడంతో మా దిగివచ్చింది. పరిశ్రమలో కొన్ని పేర్లు బయిటకు రావడం ఇందుకు కారణమనే భావన కూడా వుంది.ఏమైనా ఈ సమస్య చర్చకు రావడం, సమాజం సానుభూతితో ప్రజాస్వామికంగా అర్థం చేసుకోవడం స్వాగతించదగినవి. ఈ వ్యవహారంలో ప్రతివారు ప్రతిదశలో మాట్లాడినవన్నీ చేసినవన్నీ సరైనవని కాదు గాని సమస్య వికృత రూపాన్ని చర్చకు తేవడానికి కారణమైనాయి. ఇంత జరుగుతున్నా టాలివుడ్‌ పెద్దలెవరూ పెదవి విప్పలేదు. చివరకు జనసేన అద్యక్షుడుగా కథావూ, ఉనావో అత్యాచారాలకు వ్యతిరేకంగా మెరుపు ధర్నా చేసిన సందర్బంలో పవన్‌ కళ్యాణ్‌ మాత్రం మాట్లాడారు. ఇలాటివి తను కూడాచూశాననీ కొన్ని సార్లు కోపంతో స్పందించానని కూడా చెప్పారు. బాధితులు ముందు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే మంచిదని సలహా ఇస్తూనే పోలీసు వ్యవస్థ విఫలం కావడం వల్లనే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆయన స్పందన సమగ్రంగా వుందని చెప్పలేము గాని సానుకూలంగా సానుభూతితో వున్నమాట నిజం. మరే ప్రముఖ నటుడూ మాట్లాడని స్థితిలో ఆయన మాట్లాడారన్నది మరో నిజం. అయితే కొంతమంది ఆ నోరు విప్పని వారిని వదలిపెట్టి మాట్లాడిన పవన్‌పై ధ్వజమెత్తారు.ఒకరైతే ఆయనను ఆరోపణలకు గురైన మరో ఇద్దరితో కలిపి ముగ్గురు ఉత్తమ పురుషులు అని ఎగతాళి చేశారు. సహజంగానే ఇది యూ ట్యూబ్‌లో క్లిక్‌లకు నిలయంగా మారింది. పోలీసు స్టేషన్‌కువెళ్లమని చెప్పడం తనకు నిరుత్సాహం కలిగించిందని శ్రీరెడ్డి అన్నారు అది ఆమె స్పందన గనక పొరబాటు లేదు. మిగిలిన వారిలోకొందరు మాట్లాడని వారిని వదలిపెట్టి కొంత సానుభూతి తెల్పిన వ్యక్తిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనేదిఇక్కడ అర్థం కాని విషయం. నిజానికి కొన్ని ఛానళ్లలో పవన్‌కు సంబంధించి కథనాలు విడుదల కాబోతున్నాయనే వూహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. దీనిపై నేను ట్విట్టర్‌లో సూచనగా పేర్కొంటే జనసేన కార్యకర్తలు తమకు ముందే ఆ అంచనా వున్నట్టు స్పందించడం మరో విశేషం. మొత్తంపైన ఏదో జరగుతున్నదన్నమాట. అదెలా వున్నా మహిళలు ధైర్యంగా చేసే ఈ పోరాటాన్ని మరో విధంగా వాడుకోకుండా చూడవలసిన బాధ్యత మాత్రం అందరిపై వుంది. ఎవరిపైనైనా ఎవరైనా విమర్శలు ఫిర్యాదుల చేయొచ్చు గాని రాజకీయ లక్ష్యాలకు లేదా టిఆర్‌పి రేటింగులకు కొందరు వ్యధిత మహిళలను సమిథలుగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here