కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అణుబాంబు వేశారు. కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన అంశంలో కడుపు రగిలిపోతోందని మీడియా ముందుకు వచ్చిన ఆమె ..కేసీఆర్ పై మరకలు పడటానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణం అని నేరుగా ఆరోపణలు చేశారు. వారిద్దదరూ తీవ్రమైన అవినీతికి పాల్పడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ కు డబ్బు యావ లేదని.. కానీ హరీష్ , సంతోష్ లు మాత్రం భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. అందుకే హరీష్ రావును గతంలో కేసీఆర్ నీటి పారుదల మంత్రిగా తొలగించారని కూడా కవిత గుర్తు చేసుకున్నారు.
తన తండ్రిపై సీబీఐ కేసు నమోదు చేస్తే.. కేసీఆర్ పరువుపోతే తనకు ఆవేదన ఉండదా అని కవిత కంటతడి పెట్టుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తాను ఇవాళ ఇలా మాట్లాడుతూంటే తన వెనుక ఎవరో ఉన్నారని ఆరోపిస్తారని నిజానికి వారే రేవంత్ రెడ్డితో కలిసి తన తండ్రిపై కుట్ర చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.
కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సభ్యులతో సమావశం అయ్యారు. హరీష్ రావు, సంతోష్ రావు వ్యక్తిగత స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇద్దరు అధికారులు వందల కోట్లతో పట్టుబడ్డారని వారి వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు. అవినీతి ఆనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పై సీబీఐ కేసులు పెట్టే అంత పరిస్థితి వచ్చాక.. పార్టీ ఉంటే ఎంత..పోతే ఎంత అని ప్రశ్నించారు.ఈ కేసులో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెను సంచలనానికి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి.