Telugu360 Rating: 2.75/5
అద్భుతాలు ఒక్కసారే జరుగుతాయి.. అంటుంటారంతా. అది నిజం కూడా. కానీ ఈ నిజాన్ని నమ్మనిది సినిమా వాళ్లు మాత్రమే అనిపిస్తుంది. వాళ్లే నమ్మితే..
‘బాహుబలి’ తరవాత ‘బాహుబలి 2’ వచ్చేది కాదు.
‘పుష్ప’ రెండోసారి అవతరించేవాడు కాదు.
‘కేజీఎఫ్ 2’ మ్యాజిక్ చూసేవాళ్లమే కాదు.
అలాగని సీక్వెల్స్ అన్నీ ఆడేశాయి అని కాదు. డింకీలు కొట్టినవి బోల్డన్ని ఉన్నాయ్. కాకపోతే… ఓ అద్భుతాన్ని… మళ్లీ పునఃసృష్టి చేయాలి అనుకోవడంలో ఓ ఆనందం ఉంటుంది. ఆ కష్టంలో ఓ ఆస్వాదన ఉంటుంది. అలాంటి సినిమాల్ని చూడాలనుకోవడంలో ఓ కుతూహలం ఉంటుంది. అవన్నీ ‘కాంతార చాప్టర్ 1’కీ ఉన్నాయి. ఎలాంటి అంచనాలూ లేకుండా సంచలనాలు సృష్టించి, కన్నడ సినిమా రూపు రేఖల్ని మార్చేసిన సినిమా ‘కాంతార’. దర్శకుడిగా, నటుడిగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు రిషబ్ శెట్టి. ఆ సినిమా.. అందులోని విజువల్స్.. క్లైమాక్స్ ఇవన్నీ చూసి పూనకాలు వచ్చేశాయి అందరికీ. ఇప్పుడు చాప్టర్ 1 వస్తుందంటే ఎదురు చూడని ప్రేక్షకుడు ఎందుకు ఉంటాడు? అందుకే దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. మరి.. చాప్టర్ 1 ఎలా ఉంది? మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? అద్భుతాలు పునరావృతం కావు అనే మాట సినిమా వాళ్లు మళ్లీ అబద్దం చేశారా?
కథ:
‘కాంతార’ ఆగిన చోటే.. చాప్టర్ 1 మొదలవుతుంది. క్లైమాక్స్‌లో నాన్న మాయం అయినప్పుడు కొడుకు అడిగే ప్రశ్నతో… చాప్టర్ 1 కథకు శ్రీకారం చుట్టాడు రిషబ్ శెట్టి. కథ కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్తుంది. రాజుల కథ.. రాజ్యాల కథల్లోకి అడుగు పెడుతుంది. బంగ్రా రాజ్యాన్ని ఆనుకొని ఉండే అటవీ ప్రాంతం కాంతార. ఆ ప్రాంతాన్ని ఈశ్వరుడి పూదోట అని పిలుస్తుంటారు. ఈశ్వరుడి పూదోట సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. అక్కడ ఆ ప్రాంతాన్ని కాపలా కాస్తూ.. బ్రహ్మ రాక్షసుడు ఉంటాడన్నది ఓ కథ. అది కథో.. కట్టు కథో తేల్చడానికి వెళ్లిన బంగ్రా రాజు.. దారుణమైన చావు చస్తాడు. ఆ చావుని కళ్లారా చూసిన యువరాజు (జయరామ్) పెరిగి పెద్దవాడై రాజవుతాడు. కానీ తన పిల్లలకు ‘కాంతార వైపు పోవద్దు.. అక్కడ ఓ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు’ అంటూ హెచ్చరిస్తుంటాడు. తనకు వయసైపోయా తనయుడు కులశేఖర (గుల్షన్ దేవయ్య) కు పట్టాభిషేకం చేస్తాడు. కులశేఖర మూర్ఖుడు. తండ్రి చేయొద్దన్న పనే చేస్తాడు. తన మూర్ఖత్వంతో కాంతారపై కాలు మోపుతాడు. ఆ తరవాతే అనర్థాలు మొదలవుతాయి. కాంతారకు కాపలా.. బర్మే (రిషబ్ శెట్టి). తనకు కండబలమే కాదు.. దైవ బలం కూడా తోడుగా ఉంది. కాంతరకు తనే రక్షణ కవచం. కాంతార లో పండే పంటని బందరు తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనుకొంటాడు. అందుకు యువరాణి కనకావతి (రుక్మిణి వసంత్) సహకరిస్తుంది. బంగ్రాలో కాంతార వాసుల వ్యాపారం చేయడం యువరాజుకి ఇష్టం ఉండదు. దాంతో.. మళ్లీ ఆ ప్రాంతంపై పగ పడతాడు. తరవాత ఏమైంది? కాంతారని బ్రహ్మరాక్షసుడు రక్షిస్తాడన్నది కథేనా? ఆ ప్రాంతంలో ఉన్న శక్తి ఏమిటి? అదెప్పుడు బయటకు వచ్చింది? దురాశ, దుర్మార్గం చెలరేగినప్పుడు కాంతార ప్రజలకు దైవబలం ఎలా తోడుగా నిలిచింది? అనేది కథ.
విశ్లేషణ:
‘కాంతార’ మీకు గుర్తుండి ఉంటే ఆ కథ… దురాశతో మొదలవుతుంది. ఓ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ఆశ పడ్డవాళ్లకు ప్రకృతి.. దైవం విధించిన శిక్ష.. కాంతార. ఓరకంగా కాంతార 2 కూడా అలాంటి కథే. ఈశ్వరుడి పూదోటపై ఆశపడిన వాళ్లని, ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకొన్నవాళ్లపై కాంతారలో కొలువైన దైవం ఎలా విరుచుకుపడిందన్నది కథ. కాంతార కథలో, సంగీతంలో, ఆ నేపథ్యంలో, ఆ అడవిలో దైవిక శక్తి కనిపిస్తుంది. మెల్లమెల్లగా దాన్ని ప్రేక్షకుల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ.. క్లైమాక్స్ లో విశ్వరూపం చూపించేశాడు రిషబ్ శెట్టి. ఒక్కసారిగా కలిగే ఆ భావోద్వేగానికి ఒళ్లు జలదరిస్తుంది. ‘కాంతార 1’లో క్లైమాక్స్ చాలా కాలం గుర్తుండిపోతుంది. కాంతార 2 కూడా అలాంటి కొలతలతోనే సాగుతుంది.
ప్రారంభంలో కాంతార వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి రిషబ్ కొంత సమయం తీసుకొన్నాడు. కాంతార వాసులు బందరు వచ్చి, వ్యాపారం చేయాలనుకోవడంతో కథనం గాడిలో పడుతుంది. రథం ఫైట్ బాగా డిజైన్ చేశారు. యువరాజు కులశేఖర పాత్ర.. అతని చేష్టలు కాస్త ఫన్నీగా అనిపిస్తాయి. కాకపోతే.. పెద్దగా ఇంపాక్ట్ కలిగించవు. ‘ఇతని చేతుల్లో కాంతార ఏమైపోతుందో’ అనే భయం ప్రేక్షకుల్లో కలగదు. యువరాణితో లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆసక్తి కలిగించదు. ‘కాంతార’ చూసిన కళ్లతో చూస్తే మాత్రం ప్రతీ సన్నివేశం తేలిపోతున్నట్టు, కథ పక్కదోవ పడుతున్నట్టు అనిపిస్తుంది. ‘కాంతార’ పేరు చెడగొడుతున్నాడేమో అనే భయం కలుగుతుంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర మాత్రం మళ్లీ రిషబ్ పట్టు తెచ్చుకొన్నాడు. ఆ ఫైట్ ని చాలా బాగా డిజైన్ చేశాడు. అడవిలో పులి ఎంట్రీతోనే కథ కాస్త కుదురుకున్నట్టు అనిపిస్తుంది. ఇంట్రవెల్ ఫైట్ అనే కాదు.. ఈ సినిమాలోని అన్ని ఫైట్లూ చాలా శ్రద్దతో, కష్టపడి తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. రిషబ్ ఎంట్రీ ఫైట్ అయితే… అదో మ్యాజిక్‌లా జరిగిపోతుంది.
ద్వితీయార్థంలో రిషబ్ చాలా విషయాల్ని చెప్పాలనుకొన్నాడు. ఓ వైపు బంగ్రా రాజు కథ. మరోవైపు కాంతార కథ. ఇంకోవైపు దక్షిన దిక్కున ఉన్న వాళ్ల కథ, శివుడి ఆలయం ఎపిసోడ్.. ఇలా రకరకాల పార్శాలు ఉండడంతో దేనికి పెద్ద పీట వేయాలో అర్థం కాలేదనిపిస్తుంటుంది. ఎక్కువ విషయాలు చెప్పడం వల్ల ప్రేక్షకుడూ కన్ఫ్యూజన్కి గురయ్యే ప్రమాదం ఉంది. కాంతార లో… దైవిక శక్తి క్లైమాక్స్ ని నిలబెట్టింది. ఇందులో సెకండాఫ్ నుంచీ ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. పాత్రలు కొన్ని ఫ్లిప్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల కథనం కాస్త ఆసక్తిగా మారింది. కాంతార క్లైమాక్స్ ఎపిసోడ్ ని సెకండాఫ్‌లో ఓచోట రిపీట్ చేశాడు రిషబ్. ఈసారి పూనకం సీన్… కొత్త రూపాలు సంతరించుకొంది. ‘కాంతర’లో ఆ ఆవాహన మొదటిసారి చూస్తున్నప్పుడు ఒళ్లు జలదరిస్తుంది. అదే ఇంపాక్ట్ ఇక్కడా చూడొచ్చు. మనుషుల్ని బట్టలు ఉతికినట్టు ఉతికేయడం.. గాల్లో ఎగిరి మరీ కొట్టడం.. ఇలా ఏం చేసినా అతిగా అనిపించదు. అంతా దైవ మహిమే అనేలా ఆ సీన్స్ ఉంటాయి.
కాంతర ని ఎలాగైతే క్లైమాక్స్ నిలబెట్టిందో.. అలానే కాంతర2కి కూడా క్లైమాక్సే కాపాడింది అనుకోవొచ్చు. వార్ ఎపిసోడ్ కోసం కష్టపడ్డారు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కానీ అక్కడ కూడా చిన్న చిన్న పంచ్‌లు విసరాలని చూడడం మాత్రం బాగోలేదు. క్లైమాక్స్ లో దాదాపు 20 నిమిషాల పాటు విధ్వంసం సాగుతుంది. శివుడి దర్శనం, బ్రహ్మరాక్షసుడితో ఫైట్, చివర్లో మళ్లీ పూనకాల సీన్, దానికి తోడు ఈసారి చాముండి అవతార దర్శనం ఇవన్నీ పీక్స్ లోకి తీసుకెళ్లిపోతాయి. పులితో పాటుగా రిషబ్ పరుగెడుతున్న షాట్… పైసా వసూల్ మూమెంట్ అనిపిస్తుంది.
కాంతరలోనే అంతా చేసేశాడు రిషబ్. ఇందులో చేయడానికి కొత్తగా ఏముంది అనుకోవడానికి అక్కర్లెద్దు. క్లైమాక్స్ లో మళ్లీ తన విశ్వరూపం చూపించాడు. తను ఈ పాత్ర చేయడానికే పుట్టాడేమో అనే స్థాయిలో సాగింది నట విధ్వంసం. యాక్షన్ సీన్లు చాలా సహజంగా వచ్చాయి. అందుకోసం తను ఎంత కష్టపడ్డాడో అర్థం అవుతూనే ఉంది. రుక్మిణి వసంతన్ తెరపై అందంగా కనిపించింది. ప్రారంభంలో తన పాత్ర యువరాణి స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించడం లేదనపిస్తుంది. కానీ ఆ పాత్ర ఆర్క్ ని చివర్లో మార్చుకొంటూ వెళ్లడం బాగుంది. జయరామ్ తన అనుభవాన్ని రంగరించినప్పటికీ.. ఆ పాత్రకు జయరామ్ కంటే మంచి ఆప్షన్లు ఉన్నాయి కదా అనే ఫీలింగ్ వస్తుంది. కులశేఖర పాత్ర కూడా అంతే. పాత్రధారిని బట్టి ఆ క్యారెక్టర్లో ఉండాల్సిన సీరియెస్ నెస్ తగ్గింది.
టెక్నికల్ గా వంక పెట్టడానికి ఏం లేదు. అంతా ‘వావ్’ అనేలానే ఉంది. అటవీ నేపథ్యాన్ని తెరపై చాలా అందంగా, సహజంగా తీసుకొచ్చారు. ఆర్ట్, కెమెరా, ప్రొడక్షన్ డిజైనింగ్.. ఇలా ప్రతీ విభాగం శ్రద్ధతో పని చేసింది. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. సౌండ్ డిజైనింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. కాంతారలోని `వరాహ రూపం` పాటని ఈ సినిమాలోనూ వాడారు. ఆ పాటలో ఓ దైవత్వం ఉంది. ఈసారి అది గట్టిగానే వినిపించింది. రిషబ్ శెట్టి ఈసారి కూడా క్లైమాక్స్ నే నమ్ముకొన్నాడు. ఆ 20 నిమిషాలు సినిమా స్థాయి మరోలా ఉంటుంది. మొత్తానికి కాంతార మ్యాజిక్ ఈసారి కూడా రిపీట్ అయ్యిందా అంటే కచ్చితంగా ‘నో’ అనే అనొచ్చు. కానీ పెట్టిన రూపాయికి మాత్రం న్యాయం చేశాడు రిషబ్. కాంతర బ్యాగేజీ వదిలేసి, ఓ కొత్త సినిమా చూడడానికి ధియేటర్లకు వెళ్తే.. మీరూ ఎంజాయ్ చేస్తారు. ‘కాంతార’కంటే మించింది ఏదో కనిపిస్తుందిలే అంటే మాత్రం నిరాశ పడతారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ‘కాంతార 1’ దేవుడి గుడికి వెళ్లి… దర్శనం చేసుకోవడం లాంటిది. ‘కాంతార చాప్టర్ 1’ దేవడి పటాన్ని ఇంట్లో తీసుకొచ్చి తగిలించుకోవడం లాంటిది. రెండిట్లోనూ దేవుడు ఉంటాడు. కానీ గుడికెళ్లడంలో ఉన్న ప్రశాంతత.. ఆ వైబ్రేషన్ ఇంట్లో ఉండవు. ‘కాంతార చాప్టర్ 1’ కథ కూడా అంతే.
– అన్వర్
Telugu360 Rating: 2.75/5