సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు దేశంలో కొంత మంది దేశభక్తిని ప్రదర్శించుకోవడానికి చేసే అతి వల్ల అనర్థాలు తలెత్తుతూ ఉంటాయి. ఇందు కోసం ప్రతి సారి టార్గెట్ అయ్యే బ్రాండ్ కరాచీ బేకరి. కరాచీ పాకిస్తాన్ లో ఉన్న పట్టణం పేరే. కానీ ఆ కరాచీకి చెందిన వారు లేదా పాకిస్తాన్ వాసులు ఎవరూ .. ఆ బ్రాండ్ తో ఇక్కడ వ్యాపారం చేయడం లేదు. వారంతా అచ్చమైన భారతీయులు. దేశ విభజన సమయంలో ఇండియానే తమ దేశం అని అన్నీ వదులుకుని వచ్చేశారు. పైగా హిందువులు.
అఖండ భారత్ లో కరాచీ కూడా ఓ నగరం. దేశ విభజన జరగకముందు కరాచీ కూడా దేశ ప్రముఖ నగరాల్లో ఒకటి. అక్కడ ప్రత్యేకత..బేకరీ. దేశవిభజన తర్వాత ఇక్కడకు వచ్చేసిన వారు కరాచీ బేకరీ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. దాన్ని విస్తరించుకున్నారు. గుండెల నిండుగా దేశభక్తి ఉన్న వారు .. పాకిస్తాన్ కరాచీకి.. సంబంధమే లేదు. కేవలం అక్కడి పేరుతో ప్రసిద్ధమయింది.
పేరు ఉందని అది పాకిస్తాన్ కు చెందినదని ఎవరైనా ప్రచారం చేస్తే అంత కంటే వారికి చేసే అన్యాయం మరొకటి ఉండదు. ఇటీవల విశాఖలో కూడా కరాచీ బేకరిపై కొంత మంది దాడి చేసినంత ప్రయత్నం చేశారు. తన వ్యాపార సంస్థపై జరుగుతున్న ప్రచారం, ప్రతీ సారి టార్గెట్ అవుతున్న వైనంతో వారు మనస్తాపానికి గురయ్యారు. దుకాణాల ముందు తాము వంద శాతం ఇండియన్లం అని.. పరోక్షంగా హిందువులం అని చెప్పుకోవాల్సి వస్తోంది. మన దేశంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు. రానివ్వకూడదు. దేశభక్తిని ప్రదర్శించుకోవడానికి తోటి ఇండియన్ల మీద ప్రతాపం చూపకూడదు.