భారతదేశానికి ఒలంపిక్ మెడల్స్ సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కరణం మల్లేశ్వరి ని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కి తొలి వైస్ ఛాన్సలర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు టీవీ ఛానల్స్ మల్లేశ్వరి ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో తాను సేవలందించ లేక పోవడంపై ఒక ఇంటర్వ్యూ లోసమాధానమిచ్చారు కరణం మల్లేశ్వరి.
కరణం మల్లేశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులు కాగానే తెలుగు వారి నుండి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా అనేక మంది ఆవిడను అభినందిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. ఆవిడ కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సమాధానం ఇచ్చారు. అయితే మరొక పక్క భారతదేశానికి తొలి ఒలింపిక్ మెడల్ తెచ్చిన మహిళ తెలుగువారు కావడం మన అదృష్టమని, కానీ అలాంటి మల్లీశ్వరి సేవలని తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోలేక పోవడం మన దురదృష్టం అని సోషల్ మీడియాలో చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో టీవీ చానల్స్ మల్లీశ్వరి ని ఇదే విషయమై ప్రశ్నించాయి.
దీనికి మల్లీశ్వరి కూడా ఎటువంటి డొంకతిరుగుడు లేకుండా చాలా సూటిగానే సమాధానం ఇచ్చారు. 2000 సంవత్సరంలో తాను ఒలంపిక్ మెడల్ సాధించానని, అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం గ్రామీణ యువత నుండి క్రీడాకారులను తయారు చేసే విధంగా అకాడమీని ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహిస్తామని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్థలం కూడా ప్రభుత్వమే ఇస్తుందని మాట ఇచ్చారని, కానీ ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఆ ప్రపోజల్ ముందుకు సాగడం లేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్నేళ్ల కి, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే తాను మళ్ళీ కలెక్టర్ ని కలిసి అకాడమీ ఏర్పాటుపై చర్చించానని, కానీ అంత సానుకూలంగా పరిస్థితులు కొనసాగలేదని మల్లేశ్వరి వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుత వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తనను ఎప్పుడు ఈ విషయంలోనూ సంప్రదించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆవిడ చెప్పారు.
ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రోత్సాహానికి అవకాశం వస్తే తన వైపుగా తాను మరింత కృషి చేస్తానని, కొద్దిపాటి మౌలిక వసతులు, సరైన కోచింగ్ ఉంటే క్రీడలలో అద్భుతాలు సృష్టించవచ్చని ఆవిడ వ్యాఖ్యానించడం గమనార్హం.