పాకిస్తాన్ కు మద్దతుగా ఉంటున్నారని కాంగ్రెస్ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ ఆవేశంతో వినూత్న ఆలోచనతో మీడియా ముందుకు వచ్చారు. తాము పాకిస్తాన్ కు మద్దతుగా ఉండటం లేదని .. పాకిస్తాన్ పై పోరాటంలో భాగం అవుతామని అంటున్నారు. కావాలంటే తనకు ఓ బాంబు ఇవ్వాలని మానవబాంబుగా వెళ్లి పోరాడతానని ఆయన చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఎప్పటికీ శత్రువేనని మోదీ, అమిత్ షా ఏం చెబితే అది చేస్తామని కూడా ప్రకటించారు.
కర్ణాటక కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు జాతీయంగా వైరల్ అయ్యాయి. ఆయన ముస్లిం కావడంతో పాటు మానవబాంబుగా మారుతానని చెప్పడం కూడా దీనికి కారణం. సాధారణంగా సైన్యం కానీ.. పోరాడే వారు కానీ మానవబాంబులు అనే ప్రస్తావన తీసుకు రారు. అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలే. ఆ పనులు చేస్తాయి. జమీర్ అహ్మద్ ఉద్దేశం మంచిదే అయి ఉండవచ్చు కానీ.. మానవ బాంబు అవుతానని చెప్పడం మాత్రం ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
పహల్గాం అల్లర్ల తర్వాత జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పై వస్తున్న విమర్శలతో ఆయన బాగా ఫీలయినట్లుగా ఉన్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. స్వయంగా సిద్ధరామయ్య కూడా యుద్ధం అవసరం లేదని ప్రకటన చేశారని కర్ణాటకలో రచ్చ జరిగింది. ఇప్పుడు తాము దేశభక్తులమేనని చెప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ వేసిన ట్రాప్ లో ఇరుక్కుపోయారని అనుకోవచ్చు.