సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ ఘట్టమనేనికి మంచి పేరుంది. పెద్ద పెద్ద సినిమాలకు ఆయన పని చేశారు. తక్కువ టైమ్ లో క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వడంలో కార్తీక్ సిద్ధహస్తుడే. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. కానీ ఒక్కటే లోటు. దర్శకుడిగా హిట్ కొట్టలేకపోయాడు. ఈగల్ తో ఓ ప్రయత్నం చేసినా, ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆడలేదు. ఆ సినిమాతో దర్శకుడిగా తన అవకాశాలు పూర్తిగా మృగ్యం అయిపోయాయి. కానీ అనూహ్యంగా మిరాయ్ సూపర్ హిట్ అయిపోయింది. ఈగల్ కంటే ముందే మిరాయ్ పట్టాలెక్కింది. కానీ మధ్యలో మిరాయ్ ని ఆపి, ఈగల్ చేశారు. ఈగల్ ఫ్లాప్ అయినా, చేతిలో మిరాయ్ ఉండడం వల్ల.. కార్తీక్కి దర్శకుడిగా నిరూపించుకోవడానికి మరో ఛాన్స్ దొరికినట్టైంది. దాన్ని కార్తిక్ పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నాడు.
ఎప్పుడైతే మిరాయ్ హిట్టయ్యిందో, అప్పుడు రవితేజ ఫ్యాన్స్ అంతా.. ‘ఈగల్ 2’ గురించి మాట్లాడుకొంటున్నారు. ఈగల్ లో రవితేజ క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా, పార్ట్ 2 కోసం కథని అట్టిపెట్టడం వల్ల పార్ట్ 1 అన్యాయానికి గురైంది. అసలు కథంతా పార్ట్ 2లోనే ఉంది కాబట్టి, ఇప్పుడు పార్ట్ 2 తీసి రవితేజకు ఓ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ మొర పెట్టుకొంటున్నారు. పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్టు కూడా తన దగ్గర రెడీగా ఉందని కార్తీక్ ఘట్టమనేని చెబుతున్నాడు.
కాకపోతే… ఈగల్ ఓ ఫెయిల్యూర్ అటెమ్ట్. కనీసం యావరేజ్ దగ్గర ఆగినా, పార్ట్ 2 గురించి ఆలోచించవచ్చు. కానీ ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఈగల్ 2 అంటూ మళ్లీ చేతులు కాల్చుకోవడం కంటే, రవితేజ కోసం ఓ మంచి కథ రెడీ చేసుకోవడం చాలా నయం. కార్తీక్ అంటే రవితేజకు చాలా అభిమానం. ఈగల్ ఫ్లాప్ అయినా.. వారిద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. రవితేజ కోసం ఓ మంచి కథ రాసి, తప్పకుండా కలుస్తా అని కార్తీక్ కూడా గట్టిగా చెబుతున్నాడు. సో… ఈగల్ 2 లాంటి ఆలోచనలు పక్కన పెట్టి రవితేజ కోసం ఓ కొత్త కథ రాయడమే నయం.
మిరాయ్ 2ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని కార్తీక్ భావిస్తున్నాడు. తన దగ్గర మిరాయ్ 2కి సంబంధించి చాలా ఐడియాలు ఉన్నాయి. బహుశా.. మిరాయ్ 2 అయ్యాకే దర్శకుడిగా తదుపరి వెంచర్ మొదలెడతాడేమో? కాకపోతే ఈలోగా తేజా సజ్జా పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి.