ఓటు వేసినంత మాత్రాన కడగాలని కోరుకుంటే సాధ్యం కాదని కామారెడ్డి ప్రజలపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫైర్ అవుతున్నారు. కామారెడ్డి ఫ్లాష్ ఫ్లడ్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అక్కడి ప్రజలు చాలా నష్టపోయారు. వారంతా మా ఎమ్మెల్యే ఎక్కడా.. ఎందుకు సాయం చేయడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఆయనకు కోపం వచ్చింది.. ఓట్లేసినంత మాత్రాన వచ్చి కడగమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి ప్రజలే అతి విశ్వాసంతో వరదలు వస్తాయని తెలిసినా సురక్షిత ప్రాంతానికి పోకుండా ఇబ్బందులు పడుతున్నారని వారినే నిందిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది.
తెలంగాణలో కామారెడ్డి ఎమ్మెల్యేలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై విజయం సాధించారు. దానికి కారణం ఆయన స్థానికంగా ఉండటమే కాదు.. ఉదారంగా వ్యక్తిగత సాయం కూడా చేస్తారన్న నమ్మకం కూడా. ఎన్నికల్లో గెలవడానికి ముందే చాలా కాలంగా ఆయన డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేవారు. ప్రజలకు వ్యక్తిగత సాయం చేసేవారు. అందుకే ఎన్నికల ప్రచారంలో తన సొంత డబ్బు వంద కోట్లను ప్రజలకు సాయం చేయడానికి ఖర్చు పెడతానని హామీలు ఇచ్చారు. ఇవన్నీ వర్కవుట్ అయిపోయాయి. గెలిచారు.
కానీ గెలిచిన తర్వాత ఆయన అంచనాలను అందుకోలేకపోతున్నారు. సహజంగా ఇది అందరికీ ఉండే సమస్య. అంత హై ఎక్స్ పెక్టేషన్స్ ఇచ్చినప్పుడు .. ప్రజలు కూడా ఆశిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆశిస్తారు. అంత మాత్రాన విసుక్కోకూడదు. వీలైనంత వరకూ సాయం చేయాలి. ఎంత సాయం చేసినా అలాంటి విపత్కర పరిస్థితుల్లో తక్కువే అనిపిస్తుంది. అంత మాత్రాన.. విసుగెత్తిపోయి మాట్లాడితే.. రాజకీయంగా నష్టం జరుగుతుంది. అసలే కామారెడ్డిలో గెలిచిన ఉత్సాహంతో గతంలో తానే కాబోయే సీఎంను అని కూడా ప్రకటించుకున్నారు. తేడా వస్తే మళ్లీ ఎమ్మెల్యే కూడా కాలేరు.