కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై హూజూరాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్ ప్రకటించారు. పోలీసులతో రాజకీయం చేయాల్సినంత అవసరం లేదని ఆయన గుర్తించలేకపోతున్నారు. ఓ అంశాన్ని పట్టుకుని పదే పదే ఆయనపై ఆరోపణలు చేస్తూ వెళ్తున్నారు. హోంగార్డుల బదిలీల ప్రక్రియలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 337 మంది హోంగార్డులను జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు బదిలీ చేశారని, తిరిగి వారిని సొంత జిల్లాకు తీసుకువచ్చేందుకు ఒక్కో హోంగార్డు నుండి లక్ష రూపాయల చొప్పున సుమారు రూ. 1.86 కోట్లు వసూలు చేశారని ఆయన ఆరోపిచారు.
ఈ వసూళ్ల వ్యవహారం బయటకు పొక్కడంతో, సీపీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సురేష్ అనే కానిస్టేబుల్ను బలిపశువును చేశారని కౌశిక్ రెడ్డి చెబుతున్నారు. కేవలం ఒక కింది స్థాయి సిబ్బందిపై బదిలీ వేటు వేసి, తానే స్వయంగా విచారణ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున యాక్టింగ్ చేస్తూ సీపీ ఈ వ్యవహారం నుండి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ అవినీతి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలాలని, బాధితులైన హోంగార్డులకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
హోంగార్డులను బదిలీ చేయడానికి లక్షలు వసూలు చేస్తారని.. అదీ సీపీ స్థాయి వ్యక్తి వసూలు చేస్తారని ఎవరూ అనుకోరు. కానీ సీపీతో ఆయనకు ఉన్న పాత పంచాయతీని దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకుడి మాదిరిగా ఆయనను ట్రీట్ చేస్తున్నారు కౌశిక్ రెడ్డి. ఇటీవల ఓ ఆలయ వివాదంలో మత మార్పిళ్లకు పాల్పడుతున్నాడని సీపీపై ఆరోపణలు చేసినట్లుగా ప్రచారం కావడంతో ఆయనపై ఐపీఎస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని సీపీని టార్గెట్ చేస్తున్నారు. తాను అనని మాటల్ని అన్నారని ప్రచారం చేశారని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. హోంగార్డుల బదిలీలతో పాటు ఇంకా సీపీకి కేటాయించిన రెండు ఇన్నోవా కార్లను ఆయన స్నేహితులు, బంధువులు వాడుకుంటున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. సీపీ తన భార్యకు వ్యక్తిగత సేవలు అందించడానికి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను డ్యూటీలో ఉంచారని కూడా ఆరోపించారు.
కౌశిక్ రెడ్డి.. ఇతర రాజకీయ నేతలతో ఇలాంటి లొల్లి పెట్టుకుంటే అది రాజకీయం అనుకుంటారు కానీ..నేరుగా సీపీతో రాజకీయం చేయడం మాత్రం బీఆర్ఎస్ నేతల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. పోలీసులు టార్గెట్ చేస్తే కౌశిక్ రెడ్డి రాజకీయం చేయగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీన్ని కౌశిక్ రెడ్డి గుర్తించలేకపోతున్నారు.
