కల్వకుంట్ల కవిత తన జాగృతి తరపున జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గన పాల్ పార్క్ లో తెలంగాణ వీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ తరపున క్షమాపణలు చెప్పారు. 10 సంవత్సరాల పాలనలో వీరులకు, వారి కుటుంబాలకు సరైన గౌరవం, మద్దతు అందించలేకపోయామని ఒప్పుకున్నారు.
అసెంబ్లీలో 1,200 మంది అమరవీరులను ప్రకటించామని, కానీ కేవలం 580 కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షలు , ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ప్రభుత్వం గుర్తించిన మొత్తం 1,200 కుటుంబాలకు రూ. 1 కోటి సహాయం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కవిత ప్రకటన బీఆర్ఎస్ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారందరినీ తాము గౌరవించామని బీఆర్ఎస్ పార్టీ ఇంత కాలం చెబుతూ వస్తోంది.
కానీ ఇప్పుడు స్వయంగా కవితనే తాము ఏమీ చేయలేదని చెప్పడం.. తాను రూ. కోటి సాయం అందించేందుకు పోరాడతానని చెప్పడం ఆ పార్టీని విస్మయానికి గురి చేస్తోంది. కవిత ఇప్పుడు బీఆర్ఎస్ లో లేరు..కానీ ఆమె ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ కుమార్తె. ఆమెనే ఇలా ప్రకటిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ ఎలా ఉంటుంది ?. కవిత ప్రారంభం చూస్తే.. బీఆర్ఎస్ దగ్గర ఏ మూల అయినా తెలంగాణ వాదం అనే బలం మిగిలి ఉంటే… అది తన సొంతం కావాలన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆమె రాజకీయాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు.