తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ పంథాను మార్చుకుంటూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సొంత గడ్డ నిజామాబాద్ నుంచి జాగృతి అభ్యర్థుల్ని బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిజామాబాద్‌కు చెందిన ముఖ్య అనుచరులు, ఆశావహులతో కవిత సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతి అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20 నుంచి 30 స్థానాల్లో జాగృతి ప్రతినిధులను పోటీ చేయించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం.
జాగృతి గుర్తుగా కవిత సింహం ను ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో జాగృతి కార్యకర్తలు సింహం గుర్తును విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కవిత కసరత్తు చేస్తున్నారు. నిజామాబాద్‌లో తన పట్టును నిరూపించుకోవడంతో పాటు, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందే తనకంటూ ఒక బలమైన క్యాడర్‌ను నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఆమె ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్తున్న కవిత, నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలను తన రాజకీయ పునఃప్రవేశానికి వేదికగా చేసుకుంటున్నారు. పార్టీపరంగా వచ్చే ఇబ్బందులను పక్కన పెట్టి, సొంత బలంపై పోటీ చేయడం ద్వారా అటు ప్రత్యర్థులకు, ఇటు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గాలకు గట్టి సంకేతాలు పంపాలని ఆమె భావిస్తున్నారు.

