కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదలకు గండం ఏర్పడిందని తెలియగానే తెలంగాణ ఉద్యమం అందుకున్నారు. అప్పట్లో ఆయనకు ఆదరణ రాలేదు. ఇప్పుడు కవితకు జాగృతి పేరుతో చేస్తున్న రాజకీయాలకు ఎలా ఆదరణ ఉందో.. అప్పట్లో కేసీఆర్‌కూ అంతే ఉంది. అయినా ఆయన మొక్కవోనీ పట్టుదలతో ముందుకెళ్లారు. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. చివరికి గొప్ప విజయాలు అందుకున్నారు. ఆయన పయనంలో కవిత పాత్ర కూడా ఉంది. ఇప్పుడు కవిత సొంత బాటలో ఉన్నారు. కేసీఆర్ నే గుర్తుకు చేస్తున్నారు. ఆమె రాజకీయంపై అందరూ ట్రోల్ చేస్తున్నప్పటికీ తాను మాత్రం గట్టి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు.
అమరవీరులకు న్యాయం జరగలేదని చెప్పి .. బీఆర్ఎస్ విశ్వసనీయతపై దెబ్బ!
తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు న్యాయం జరగలేదని..క్షమాపణలు చెప్పడం ద్వారా కవిత ఓ రకంగా రాజకీయంగా సంచలనం సృష్టించారు.ఇలా చెప్పడం అంటే.. బీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ తీసేయడమే. తెలంగాణ సాధించలేకపోతే తాను మెడ కోసుకుంటాను కానీ మీరేవరూ ఆవేశపడవద్దని కేసీఆర్ చేసిన రెచ్చగొట్టిన ప్రసంగాల వల్లే ఎక్కువ మంది యువత ప్రాణాలు తీసుకున్నారన్న విమర్శలు ఇతర నేతలు చేస్తూంటారు. వారి ఆత్మహత్యల ఫలితంగా కేసీఆర్‌కు పదవి వచ్చిందని చెబుతూంటారు. అలాంటి వారికి కూడా అన్యాయం చేశారంటే.. అది బీఆర్ఎస్ .. పునాదులను బలహీనం చేసినట్లే. అలా చెప్పడం ద్వారా కవిత.. తాను రాజకీయాల్లో ఎలాంటి రిజర్వేషన్స్ పెట్టుకోనని గట్టి సంకేతాలు పంపారు.
కట్టర్ తెలంగాణ వాదంతో బీఆర్ఎస్ బలంపై గురి !
ఓ వైపు అమరవీరులకూ బీఆర్ఎస్ అన్యాయం చేసిందని చెప్పడమే కాదు.. ఆ పార్టీ బలమైన తెలంగాణ వాదాన్ని కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణకు తామే రక్ష అని ఎంత చెప్పినా.. ప్రజలు నమ్మడానికి జంకుతున్నారు. దీనికి కారణం తెలంగాణను వదిలేసి వారు భారత రాష్ట్ర సమితి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో విలీనాన్ని అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ బలం అయిన తెలంగాణ వాదానికి గట్టి వారసురాలిగా కవిత తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.
కవితను తక్కువ అంచనా వేస్తే ఎవరికైనా రాజకీయంగా నష్టమే !
కవిత జనం బాటను ప్రజలు పట్టించుకోరని.. షర్మిలలా ఆమె పాదయాత్ర కూడా సెల్ఫ్ ఫైనాన్స్ పద్దతిలో సాగిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ షర్మిలకు తెలంగాణ ప్రాంతంతో లేని ఎమోషనల్ టచ్ కవితకు ఉంది. వైఎస్‌కు లేని ఇమేజ్ ను ఆపాదించి.. చేసుకున్న ప్రచారం వర్కవుట్లు కాలేదు. కానీ కవిత ఇక్కడ కేసీఆర్ బొమ్మనూ ఉపయోగించుకోవడం లేదు. ఆమె రాజకీయాలను తక్కువ అంచనా వేస్తే.. ఆ రాజకీయ పార్టీకి నష్టమే జరుగుతుంది. కవిత కేసీఆర్ కుమార్తె.. ఆయన రాజకీయానికి వారసురాలు.. మరి ఎలా తక్కువ అంచనా వేయగలరు!
