తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షం అంటే పరామర్శలు, విమర్శలు, సోషల్ మీడియా ఫేకులు అన్నట్లుగా మారిపోయిన సమయంలో కవిత ..తనదైన రాజకీయంతో తెరపైకి వస్తున్నారు. కవిత చేపట్టిన వెలుగుమట్ల పోరాటం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మలుపు తిప్పింది. వెలుగుమట్ల బాధితుల కోసం ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమె చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష, అంతకుముందు చేసిన ధర్నా.. బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
ఈ తరహా పోరాటం బీఆర్ఎస్ ఒక్కటీ చేయలేదు !
సుదీర్ఘ కాలం అధికారంలో ఉండి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి, అసలైన ప్రజా పోరాటం ఎలా ఉండాలో కవిత తన ఆందోళన ద్వారా చేసి చూపించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది . ప్రస్తుతం బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్ వంటి నేతలు కేవలం సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం , ప్రెస్ మీట్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికే పరిమితమవుతున్నారు. అదే రాజకీయం అనుకుంటున్నారు. కానీ ప్రజాపోరాటాలు మాత్రం చేయలేకపోతున్నారు.
రాజకీయ పోరాటాన్ని చూపించిన కవిత
ప్రతిపక్షం అంటే కేవలం డిజిటల్ విమర్శలే కాదని, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి పోరాడటమే అని కవిత నిరూపించారు. రోజంతా హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ దీక్ష, సోషల్ మీడియా రాజకీయాలకు మించి భౌతిక పోరాటాల ఆవశ్యకతను గుర్తుచేసింది. కవితకు ఉన్న రాజకీయ అవగాహన, మొండితనం ఈ పోరాటంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఆమె అనుసరిస్తున్న వ్యూహాలు పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌ల ద్వారా వచ్చే మైలేజీ కంటే, జనం మధ్య ఉండి చేసే నిరసనలకే మైలేజీ ఎక్కువ ఉంటుందని ఈ పర్యటనతో స్పష్టమైంది.
కవిత పోరాటానికి గుర్తింపు
ఈ రకమైన మాస్ పాలిటిక్స్ కవితను పార్టీలో మరో మెట్టు పైకి ఎక్కించే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఒరవడిని కవిత కొనసాగిస్తే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. కేటీఆర్ చేసే హై-టెక్ రాజకీయాలతో పోల్చితే, కవిత చేస్తున్న క్షేత్రస్థాయి పోరాటాలే పార్టీకి పూర్వవైభవం తెస్తాయని కార్యకర్తలు భావించే చాన్స్ ఉంది. అదే జరిగితే రాజకీయం మారిపోతుంది.


