భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతోంది?. ఇది తెలంగాణ రాజకీయవర్గాల్లో చాలా మందికి వస్తున్న సందేహం. కానీ ఇది కుటుంబకథా చిత్రం. అసలేం జరుగుతుందో కల్వకుంట్ల ఫ్యామిలీలోని ముఖ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ కవిత మాటల్ని బట్టి అర్థం చేసుకుంటే కొంత మందిని దూరం పెట్టకపోతే చీలిక వస్తుందని నేరుగా “డాడీ కేసీఆర్‌కు” కవిత సందేశం పంపారు. కోవర్టులు అని ఆమె తేల్చేశారు. ఆమె చెప్పిన కోవర్టులు, దెయ్యాలు ఎవరో బీఆర్ఎస్ అగ్రనాయకులందరికీ తెలుసు. వారిని కేసీఆర్ దూరం పెట్టకపోతే..కవిత తన దారి తాను చూసుకోవడం ఖాయం.
కవితకు రాజకీయాలు వద్దని ఒత్తిడి చేస్తున్న కేసీఆర్ కోటరీ ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత అరెస్టు కావడానికి ముందూ, తర్వాత ఆ కుటుంబంలో చాలా పరిణామాలు జరిగాయి. కవిత ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్తున్నారు. ఎప్పుడో ఓసారి తెర ముందుకు వస్తున్నారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడానికే చాలా ఆలోచించారు. లిక్కర్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఇక కవితను రాజకీయాలకు దూరంగా ఉండాలని.. కేసీఆర్ కోటరీ ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఆరేడు నెలల పాటు ఓపిక పట్టిన ఆమె ఆ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండలేనని తెరపైకి వచ్చేశారు. పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఉండనప్పటికీ జాగృతి పేరుతో రాజకీయం చేశారు.
సొంత పార్టీ కాదు… పార్టీలో ప్రాధాన్యమే కీలకం !
కవిత సొంత పార్టీ పెట్టుకోవాలని అనుకోవడం లేదు. కానీ పార్టీలో ఆమె చెప్పిన కొంత మంది దెయ్యాలు.. తనను రాజకీయాల నుంచి దూరం చేయాలని అనుకోవడంపై మాత్రం సంతృప్తిగా లేరు. ఢిల్లీ లిక్కర్ కేసును చూపించి తనను దోషిగా తేల్చి రాజకీయాల నుంచి దూరం చేయడం సరి కాదని ఆమె వాదన. సహజంగానే కవితకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత సమర్థమైన నేతల్లో కేసీఆర్ తర్వాత తానే ఉంటానని నమ్ముతారు. తనపై కావాలని కొందరు కుట్రలు చేస్తున్నారని అనుకుంటున్నారు. తనకు పార్టీలో తన స్థాయికి తగ్గట్లుగా ప్రాధాన్యత దక్కితే .. తాను చెప్పిన కోవర్టుల్ని దూరం పెడితే.. అంతా సద్దుమణిగిపోతుందని లేకపోతే పరిణామాలు తెలంగాణ జాగృతి పార్టీ వరకూ వెళ్తాయని సంకేతాలు ఇచ్చారు. ఎయిర్ పోర్టు వద్ద చోటు చేసుకున్న పరిణామాలే దీనికి సాక్ష్యం.
కేసీఆర్ ఏం చేయబోతున్నారు ?
కుమార్తె లేఖ బయటకు రావడం వెనుక కేసీఆర్ ఏమనుకుంటున్నారన్నది ఇంకా బయటకు తెలియలేదు. కానీ ఆయన సీరియస్ గా తీసుకోకుండా ఉండలేరు. ఆ లేఖను కవిత లీక్ చేసి ఉంటారని మొదట అనుకున్నారు. కానీ ఆ లేక కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే లీక్ అయిందని ఆమె అంటున్నారు. అక్కడ ఉన్న వారిలో దెయ్యాలెవరు అన్నది కేసీఆర్ కు బాగా తెలుసు. అది జోగినపల్లి సంతోష్ కుమారా..కేటీఆరా…లేకపోతే కేసీఆర్ బాగా నమ్మే వేముల ప్రశాంత్ రెడ్డినా అన్నది వారికే తెలియాలి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నది కీలకం. కవితను రాజకీయాలకు దూరంగా ఉండటం సాధ్యం కాదని తేలిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన కవిత చెప్పే దయ్యాలను దూరం పెట్టి.. కుమార్తెకు ప్రాధాన్యం ఇస్తారా..?. కవిత తనలా సొంత పార్టీ పెట్టుకుని నిరూపించుకుంటే…చూసి సంతోషపడాలనుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.
ఎలా చూసినా బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ మాత్రం.. కీలక మలుపుల తర్వాతే క్లైమాక్స్‌కు చేరుకోనుంది. అప్పటి వరకూ అనేక రకాల మలుపులు చోటు చేసుకోనున్నాయి.