హిట్ – ఫ్లాప్ అనేవే కెరీర్నీ, క్రేజ్ ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్లకు. ఓ సినిమా హిట్టయితే వాళ్ల పారితోషికం అమాంతంగా పెరిగిపోతుంది. ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాతలు గీచి గీచి బేరాలు మొదలెడతారు. కొంతమంది కథానాయికలు మాత్రం హిట్లూ, ఫ్లాపులూ అనే తేడా లేకుండా, అవకాశాలు అందుకొంటూనే ఉంటారు. సినిమా సినిమాకీ తమ పారితోషికాన్ని పెంచుకుంటూనే ఉంటారు. కొత్తమ్మాయి కయాదు లోహర్ కూడా ఈ జాబితాలో చేరుతుందేమో అనిపిస్తోంది. డబ్బింగ్ సినిమా ‘డ్రాగన్’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొంది కయాదు. ఆ సినిమాతోనే తెలుగులోనూ ఆఫర్లు అందుకొంది. ప్రస్తుతం ‘పారడైజ్’లో నటిస్తోంది. తను హీరోయిన్గా చేసిన ‘ఫంకీ’ ఇటీవలే విడుదలైంది.
ఈ సినిమా ఫ్లాప్. అయినా సరే, స్క్రీన్ ప్రెజెన్స్ లో తన మార్క్ చూపించింది కయాదు. అందుకే పారితోషికం కూడా పెంచేసింది. ‘ఫంకీ’కి గానూ కయాదు రూ.60 లక్షలు మాత్రమే తీసుకొందని సమాచారం. ఇప్పుడు కోటి అడుగుతోందట. ఇటీవల ఓ నిర్మాత కయాదును సంప్రదిస్తే ‘కోటి తగ్గితే సినిమా చేయను’ అనేసిందని టాక్. ఈ షరతుమీదే కొత్తగా రెండు సినిమాల్ని ఒప్పుకొందని సమాచారం. యూత్ హీరోల సినిమాల్లో కయాదు మంచి ఆప్షనే. సోషల్ మీడియాలో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమా ప్రమోషన్లలో బాగానే పార్టిస్పేట్ చేస్తోంది. తమిళ సినిమాకూ పరిచయమే. కాబట్టి.. కయాదుకు కోటి ఇవ్వడం తప్పేం లేదన్నది నిర్మాతల మాట. సినిమా ఫ్లాప్ అయితేనే కోటి అందంటే, హిట్ అయితే.. ఇంకెంత అడుగుతుందో?