చండీయాగం అవసరమా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చండీయాగానికి పూనుకున్నారు. డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు మెదక్‌ జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌస్‌లో `ఆయుత చండీయాగం’ జరగబోతున్నది. దీంతో చండీయాగం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో పెరిగిపోతున్నది. వేదకాలం నుంచి మహర్షులు అనేక యజ్ఞయాగాదులను లోకకల్యాణం కోసం నిర్వహించేవారు. ఇందుకు ఆయా కాలాల్లోని రాజులు, చక్రవర్తులు సహాయసహకారాలను అందించేవారు. కాలంమారినా యజ్ఞయాగాదులు జరుగుతూనే ఉన్నాయి. ఒక మంచి పనికోసం చేస్తున్న యాగాలను తొందరపాటుగా విమర్శించకూడదు. ఇక ప్రస్తుతం కేసీఆర్ విషయమే తీసుకుందాం, ఆయన తెలంగాణ రావడంకోసం యాగం చేసినమాట నిజమే. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకోసం యాగం చేయబోతున్నారు. కేసీఆర్ యాగం అనగానే విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ లెక్కచేయకుండా ఆయన ధృడమైన సంకల్పంతో ముందుకుసాగిపోతున్నారు. ఆయుత చండీయాగాన్ని కేసీఆర్ చేయబోతున్న సందర్భంగా అసలు చండీయాగం ఎవరైనా ఎందుకు చేస్తారో, ఈ కలియుగంలో దాని అవసరం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం పేరు ఇప్పుడు తరుచుగా వినబడుతున్నది. ఏమిటీ ఆయుత చండి … అన్న సందేహం కలుగుతోంది. సకలదేవతా స్వరూపిణిగా పూజలందుకుంటున్న దుర్గమాతయే చండీ పరదేవత. చండీమాతను ధ్యాన, ఉపాసనమార్గాల్లో కొద్దిపాటి తేడాలతో చండి, నవ చండి, శత చండి, సహస్ర చండి, ఆయుత చండి, లక్ష చండి, ప్రయుత చండిగా చండీయాగ పరిధి బహుముఖాలుగా విస్తరించింది. మరికొంతమంది లక్ష చండీయాగం కూడా చేస్తుంటారు. 64 తంత్రగ్రంథాలు చండీయాగం నిర్వహణ గురించి చెప్పడంవల్ల ఎవరు ఏ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్నదానిపై యాగం పేరు నిర్ధారించబడుతున్నది. కాబట్టి ఆయుత చండీయాగమన్నది ఒక నిర్దుష్ట పద్ధతిలో జరిగే చండీయాగంగానే భావించాలి.

చండీయాగం క్షుద్రమైనదా ?

ఈ సృష్టిలో మంచీచెడులు కలిసేఉంటాయి. గౌరీమాత కరుణామూర్తి అయితే, పిల్లవాడిని సన్మార్గంలో పెట్టేందుకు కన్నెర్రచేసే రూపమే చండీ. యజ్ఞయాగాదులు నిర్వహించేటప్పుడు ఏ ఉద్దేశంతో సంకల్పం చెప్పుకుంటామన్నదే చాలా ముఖ్యం. సంకల్పం మంచిదైతే మహోగ్రరూపధారిణి కాళీమాత కూడా కరుణామూర్తిగానే సాక్షాత్కరిస్తుంది. అదే , సంకల్పం మానవకల్యాణానికి విరుద్ధమైనదిగా ఉంటే, సౌమ్యరూపిణి సైతం ఉగ్రరూపంగా దర్శనమివ్వొచ్చు.

అమ్మ ప్రేమ తత్త్వమే `చండీ తత్త్వం’గా చెబుతుంటారు. చండీమాతకు కోపం ఎక్కువే. అయితే ఆ కోపం ఎలాంటిదంటే, పిల్లవాడి విషయంలో తల్లికివచ్చే కోపంలాంటిది. తన పిల్లలను దుష్ట శక్తుల నుండి కాపాడుకోవడంకోసం దుర్గామాత చండీగా అవతరిస్తుంటుంది. తంత్రశాస్త్ర పద్ధతిలో ఆరాధించినంతమాత్రాన చండీమాత క్షుద్రదేవతకాదు, చండీయాగం క్షుద్రయాగం అంతకంటే కాదు. యాగం ఆచరించే పద్ధతినిబట్టి రూపు మారుతుంటుంది.

దోషం తలెత్తితే…

శాక్తేయ తంత్ర భాగంలో, మంత్ర భాగంలో అత్యంత శక్తిమంతం, అత్యద్భుత ఫలితాలను ప్రసాదించేదిగా చండీ యాగానికి గొప్ప పేరుంది. ఇది ఎంతో శక్తిమంతమైనజీ, మరెంతో ఉత్కృష్టమైనది. ఏమాత్రం నియమ నిష్ఠలు తగ్గినా అది అత్యంత ప్రమాదకరం, భయోత్పాత కారకం. నియమాలు సరిగా పాటించకపోతే ఉపాసకుని ప్రాణాలకే ముప్పు. అందుకే ఇలాంటి యాగాలు చేసేముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మరోమాటలో చెప్పాలంటే సాహసికులు, జగదంబ పట్ల భక్తిశ్రద్ధలు ఉన్నవారే ఉపాసకులుగా మారాలి. బలవంతంగా ఎవ్వరినీ ఉపాసకునిగా మార్చకూడదు.

చండికాసుర, రక్తాక్ష, రక్త బీజ, రక్తదంత, మహిషాసురాది అసుర సంహారం కోసం అమ్మవారు దుర్గ, చండిక, చాముండి తదితర అవతారాలను సృజింపజేసుకుని లోక కల్యాణం కోసం నవ దుర్గలుగా సుప్రసిద్ధమైంది.

ఏదైనా కార్యం సిద్ధించాలని ఉపాసకుడు అనుకుంటే, నవరాత్రులప్పుడేకాదు, ఎప్పుడైనా చండీ సప్తశతి లేదంటే దుర్గా సప్తశతిని పారాయణం చేయడం ఉపాసకులు ఎంచుకునే ఒకానొక మార్గం. సప్తశతి అంటే 700 శ్లోకాలుంటాయి. వాటిని పారాయణం చేయడం వల్ల మనోబలం పెరుగుతుంది. పోరాటపటిమ ఏర్పడుతుంది.

చండీయాగాన్ని నిర్వహించే వ్యక్తికి మనోసంకల్పం ధృడంగా ఉండాలి. మనసును స్థిరలగ్నంలో ఉంచుకోవాలి. కేసీఆర్ కు మనోసంకల్ప బలం ఎక్కువగా ఉండబట్టే ఆయన చండీయాగాలను నిర్వహించగలుగుతున్నారు. మూడవసారి చండీయాగం తలపెట్టగలగడం ఓ విశేషం.

వామాచారం, దక్ణిణాచారం

చండీయాగాన్ని రెండు రకాల ఆచారాల్లో నిర్వహించవచ్చు. అందులో 1. వామాచారం. 2. దక్షిణాచారం. వామాచార పద్ధతిలో రక్త, మాంసాది నైవేద్యాలు, శ్మశానంలో పూజల్లాంటివి ఉంటాయి. ఇక దక్షిణాచారం ప్రకారం బలి ఇవ్వడానికి బదులుగా కొబ్బరికాయలు కొడతారు. రక్త మాంసాది నైవేద్యాలకు బదులుగా పళ్లు, పండ్ల రసాలు సమర్పిస్తారు. పరిమిళ ద్రవ్యాలు, పవిత్రజలాలు ఉపయోగిస్తారు. ఉపాసకులు ఎలాంటి మార్గం ఎంచుకుంటారన్నది వారివారి ఆలోచనలనుబట్టి ఉంటుంది. అమ్మవారి దయమాత్రం ఒకేవిధంగా ఉంటుందని శాస్త్రం చెబుతున్న మాట.

యాగాలతో వర్షాలు పడతాయా ?

ఈమధ్య చండీయాగం, అతిరాత్రం అనే మహాయజ్ఞం పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఇలాంటి యాగాలు, యజ్ఞాలు చేయడం వల్ల వానలు పడతాయనీ, కరువుకాటకాలు లేకుండా పోతాయనీ, విశ్వశాంతి చేకూరుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే నిజంగానే యాగాలతో వర్షాలు పడతాయా, యజ్ఞాలతో లోకకల్యాణం సిద్ధిస్తుందా ? అని ప్రశ్నించుకుంటే ఏదీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎవరికితోచిన ఆధారాలతో వారు వివరణ ఇవ్వడమే దీనికి కారణం.

ఫలితం ఎలా ఉన్నప్పటికీ, సదుద్దేశంతో యాగాలు చేయడం ఏనాటికి తప్పుకాదు. ఉదాహరణకు, వానలు పడాలనో, లేదా దేశానికి యుద్ధభయం పోవాలనో సంకల్పం చెప్పుకుని యాగం ప్రారంభించడం తప్పు ఎలా అవుతుంది? యజ్ఞయాగాలతో హోమగుండం నుంచి వెలువడే దట్టమైన నల్లటిపొగ వల్ల మేఘాలు ఏర్పడి వర్షం పడుతుందన్న లాజిక్ – శాస్త్రీయకోణంలో నిలవకపోవచ్చు. కానీ వందలాది మంది మంచిమనసుతో ప్రార్థించడమే సమాజానికి చేకూరే వేయిరెట్ల బలం. వానలు పడకపోయినప్పటికీ దైవం మీద నమ్మకంతో సంకల్పబలంతో బతుకుబాటలు వేసుకోవడమే ఇందులోని పరమార్థం. కష్టాలు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఎలా ఉపయోగపడతాయో, అలాంటి ప్రయోజనమే సమాజానికి ఈ యజ్ఞయాగాదులు అందిస్తున్నాయి. అంటే ఇక్కడ ముఖ్యమైనది- నమ్మకమే. అదే దైవం, అదే యాగం, అదే యజ్ఞం.

చండీయాగం కథ…

చండీయాగం గురించి, సప్తశతి గురించి తెలుసుకుందామనే ఆసక్తి చాలామందిలో కనిపిస్తుంటుంది. దుర్గాసప్తశతిగా లేదా చండీ సప్తశతిగా పేరొందిన కథా గమనం ఓసారి పరికిద్దాం.

హరినాధశర్మగారు తన వ్యాసంలో చండీయాగ కథ గురించి చెబుతూ, చండీ అంటే జ్వలించే అగ్ని అని పేర్కొన్నారు. అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణంలో ఉన్నది ఈ కథ. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్ ఛందస్సులను అనుసరించి ఉన్న సుమారు 587 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. వీటిని కొన్నిచోట్ల స్వతంత్ర వాక్యాలుగానూ, సంభాషణాక్రమంలో ఉన్న ఉవాచలను వాక్యాలుగానూ విభజించి 700 వాక్యాలు (మంత్రాలుగా) విభజించడంతో సప్తశతిగా పేరుపొందింది. వాక్యాల విభజన, మంత్రాల విభజనలో అనేక సంప్రదాయ భేదాలున్నాయి. 13 అధ్యాయాలుగా ఉన్న సప్తశతిలో ప్రథమ చరిత్రగా ఒక అధ్యాయం, మధ్యమ చరిత్రగా 3 అధ్యాయాలు, ఉత్తమ చరిత్రగా 9 అధ్యాయాలను విభజించారు. ఈ విభజనలో అనేక సంప్రదాయభేదాలు పాఠాంతరాలు కనిపిస్తున్నాయి.

మార్కండేయ మహర్షి తన శిష్యుడైన భాగురికి చెప్పిన విషయాలే ఇందులో కథాంశం.
చైత్ర వంశానికి చెందిన సురథుడు అనే మహారాజు శత్రువుల చేతిలో ఓడిపోయి అడవుల పాలవుతాడు. సమాధి అనే వైశ్యుడు భార్యాబిడ్డల చేత వెళ్లగొట్టబడతాడు. ఈ ఇద్దరికీ అడవులలో సుమేదుడనే బ్రహ్మర్షి పరిచయ భాగ్యం కలుగుతుంది. ఆ మహర్షి వారికి మధుకైటభులను వధించిన మహాకాళి కథను, మహిషాసురుని హతమార్చిన మహాలక్ష్మి చరిత్రను, శుంభనిశుంభులను పరిమార్చిన మహా సరస్వతి విజయగాథను వివరిస్తాడు. ఆ తర్వాత రాజు, వైశ్యుడు ఇద్దరూ జగన్మాతను కఠోర నియమాలతో ఉపాసిస్తారు. మహా చండీయాగం చేస్తారు. అమ్మ అనుగ్రహించి రాజుకు కోరిన విధంగా రాజ్యాన్ని ప్రసాదించి, మరుజన్మలో సావర్ణి మన్వంతరానికి అధిపతిని చేస్తుంది. అహంకార మమకార రహితమైన మహోన్నత స్థితిని అర్థించిన వైశ్యుడైన సమాధికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

ఎలాంటప్పుడు చండీయాగం చేయాలి ?

ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. యుగధర్మం ప్రకారం మంచికంటే చెడు ఎక్కువగా రాజ్యమేలుతోంది. మనుషుల్లో స్వార్థచింతన పెట్రేగిపోతున్నది. తనదికాని భూమిపై హక్కులు సంపాదించుకోవాలన్న యావ పెరిగిపోతుంది. ఇతరుల వస్తువులను, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తారు. అందుకు ఎలాంటి దారుణాలకైనా వెనుకాడరు. హింస పెరిగిపోతోంది. ఉగ్రవాద పోకడలు పెచ్చుమీరతాయి. శాంతి సూత్రాలు ఎవ్వరి చెవులకెక్కవు. చేతలకంటే మాటలు చెప్పేవారు ఎక్కువవుతారు. దేశమంతటా అసహనం పెరిగిపోతుంటుంది. కులాలు, మతాలంటూ కొట్టుకు చస్తుంటారు. నియంతలే పాలకులవుతారు. కుటుంబపాలన పెరిగిపోతుంటుంది. రక్షకభుటులే హింసను ప్రోత్సహిస్తుంటారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందవు. మధ్యదళారులు ప్రజలను పీల్చిపిప్పిచేస్తుంటారు. కరవుకాటకాలు, వరదలతో ప్రజలు అల్లాడతారు. మానవజాతి నిర్వీర్యమవుతుంది. ముష్కరమూకలు దాడులకు పాల్పడుతుంటారు. చోరభయం ఎక్కువవుతుంది.

ఇలాంటి కలియుగ కాలంలో మనల్ని రక్షించే దేవతలు ఇద్దరే. వారిలో ఒకరు వినాయకుడు కాగా, మరొకరు చండీదేవత. అందుకే ‘కలౌ చండీ వినాయకౌ’అంటారు. అందుకే, ఏ కార్యం ప్రారంభించినా గణపతి పూజ, గౌరీ రూపంలో చండీదేవతారాధన చేస్తుంటాము. కలిపురుషుడు రాజ్యమేలుతున్నప్పుడు జ్వలించే అగ్నిలాంటి దేవతే మనకు కావాలి. ఆమె ద్వారానే దుష్టశక్తుల అంతం జరుగుతుందన్న భావనే మహా చండీయాగ నిర్వహణకు ప్రేరణగా నిలుస్తోంది. ఇది ఎవరు చేసినా మనమంతా సంతోషించాలి. విమర్శలను పక్కనబెట్టి దీన్ని సత్కార్యంగా భావిస్తూ మద్దతు పలకాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close