కెసిఆర్ కి బ్యాడ్ టైం మొదలైందా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ఆయన పార్టీ టిఆర్ఎస్ కి ఒక ఆరు నెలల క్రితం వరకు గోల్డెన్ టైం నడుస్తున్నట్లుగా కనిపించింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా కెసిఆర్ కి బాడ్ టైం మొదలైందా అన్న విశ్లేషణలు, చర్చలు ఇటు నెటిజన్ల లోనే కాకుండా అటు ప్రజలలో కూడా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

మోడీ తో కేసీఆర్ సంబంధాలు దెబ్బ తింటున్నాయా?

కెసిఆర్ నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు వరకు కేసీఆర్కు మోడీ తో ఉన్న సంబంధాలు ఏమైనా దెబ్బ తిన్నాయా అన్న చర్చ మొదలయింది‌. ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కి నప్పటికీ కేవలం యూపీ ఏ పక్షాలను మాత్రమే చీల్చడానికి కి ప్రయత్నిస్తూ ఎన్డీఏ పక్షాల జోలికి వెళ్ళక పోవడంతో కేసీఆర్ మోడీ కి ప్లాన్ బి గా పని చేస్తున్నాడు అంటూ దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలు అభిప్రాయ పడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయినట్టు గా కనిపిస్తోంది.

సారు, కారు , 16 అంటూ టిఆర్ఎస్ గొప్పలు చెప్పుకున్నప్పటికీ కేవలం అందులో సగం మాత్రమే గెలుచుకోవడం ఒక షాక్ అయితే, అనూహ్యంగా బిజెపి 4 సీట్లు గెలుచుకోవడం మరొక షాక్ అయ్యింది. మోడీ మీద తెలంగాణ ప్రజల్లో కూడా అభిమానం ఉందన్న విషయం అర్థమైన తర్వాత బీజేపీ పెద్దలు చకచకా పావులు కదపడం ప్రారంభించారు. ఇతర పార్టీల లోని బలమైన నేతలను చేర్చుకోవడం, టిఆర్ఎస్ కి తామే ప్రత్యామ్నాయం అని ప్రజలకు వివరించడం, 2023 ఎన్నికల కల్లా అధికారంలోకి రావడం అనే నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకుని బీజేపీ పెద్దలు పని చేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐతే, మొదట్లోనే అప్రమత్తమైన కేసీఆర్ కూడా బిజెపి క్షేత్ర స్థాయిలో బలోపేతం కాకుండా అంతర్గతంగా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీని బలోపేతం కాకుండా అడ్డుకున్న చంద్ర బాబు ని టార్గెట్ చేసినట్లు గానే బిజెపి కేసీఆర్ ని కచ్చితంగా టార్గెట్ చేయబోతోంది అంటూ రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి

జగన్ ఫ్యాక్టర్ కెసిఆర్ కి ప్రతికూలంగా మారనుందా?

ఢిల్లీలో చక్రం తిప్పుతాం, హస్తిన స్టీరింగ్ మనదే అంటూ బీరాలు పలికిన టిఆర్ఎస్ సింగిల్ డిజిట్ ఎంపి స్థానాలకు పరిమితం అయితే, జగన్ ఏకంగా 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్నారు. పైగా జగన్ మోడీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. తనకు ఉన్న పరిమితుల దృష్ట్యా ( కేసులు కావచ్చు, మొదటిసారి ముఖ్యమంత్రి కావడం కావచ్చు) ఇప్పట్లో మోడీకి నష్టం కలిగించే పనులు చేయని పరిస్థితి లో ఉన్నాడు. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కు టిఆర్ఎస్ ప్రత్యర్థిగా ఉండడం వల్ల, జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ అవసరం ఎవరికీ లేకుండా పోయింది.

జగన్ ఫ్యాక్టర్ మరొక రకంగా కూడా కేసీఆర్ ను ఇబ్బంది పెడుతోంది. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఆర్టీసీ విలీనం, సిపిఎస్ రద్దు, ఐఆర్ 27 శాతం పెంపు వంటి నిర్ణయాలు తీసుకోవడంతో పొరుగున ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఉద్యోగుల నుండి ఇవే ప్రతిపాదనలు, ఒత్తిడులు వస్తున్నాయి. గత ఐదేళ్లలో మహిళా మంత్రులు లేకుండా కెసిఆర్ నడిపిన పాలన ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు జగన్ ని చూపిస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు. 2014 ఎన్నికలు అయిన కొత్తలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ముందు కెసిఆర్ పాలన తేలి పోతుందని కొందరు భావిస్తే, గత అయిదేళ్లలో అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం ముందు తేలి పోవడంతో ఎంతో జనరంజకంగా కనిపించింది కెసిఆర్ పాలన. కానీ ఇప్పుడు అదే కెసిఆర్ పాలన, చేతికి ఎముక లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ పాలన ముందు తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తాము మద్దతు ఇచ్చిన, తాము గెలవాలని కోరుకున్న వైఎస్ఆర్సిపి పార్టీ విజయం, ఎన్నికల తర్వాత తమ మీద ఈ విధంగా ప్రభావం చూపిస్తుందని బహుశా కెసిఆర్ తో సహా టిఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరు ఊహించి ఉండరు.

కెసిఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత తగ్గుతోందా?

2018 ఎన్నికలలో కెసిఆర్ గెలిచిన వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళ్లి కూడా గెలిచిన మేరునగ ధీరుడు అని ఎంతో మంది ప్రశంసించారు. కానీ ఆ ఫలితాల తర్వాత కొద్ది నెలలకే పరిస్థితి మారుతున్నట్లుగా కనిపించింది. అంతటి భారీ విజయం సాధించిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం, మంత్రి వర్గాన్ని విస్తరించకుండా నాన బెట్టడం, గెలుపు నిచ్చిన ప్రజల కోసం ఏం చేయాలన్న దానికంటే ఎక్కువగా రాజకీయ వ్యూహాల మీద, పార్లమెంటు ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం, ఇవన్నీ ప్రజలు కేసీఆర్ పట్ల అభిప్రాయాన్ని కొంతవరకు మార్చుకునేలా చేశాయి.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వాకం సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన శైలి మరొక ఎత్తు. ఎంతో మంది తెలంగాణ ప్రజలు కూడా నేరుగా టీవీ కెమెరాల ముందే, కెసిఆర్ పతనం ఇప్పుడు ప్రారంభమైందని, ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడే బాగుండేదని వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇవి ఆవేశంతో చేసిన వ్యాఖ్యలే అయి ఉండవచ్చు కానీ, గత ఐదేళ్లలో కేసీఆర్ కు పట్టం కట్టిన ప్రజలలో కెసిఆర్ పట్ల కాస్త ప్రతికూలత మొదలైంది అనడానికి అది నిదర్శనంగా నిలిచింది.

మొత్తం మీద:

అయితే కెసిఆర్ రాజకీయ చాణక్యత ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. పార్టీ పని అయిపోయిందని అనిపించిన ప్రతి సారి తన చాణక్య త తో, వ్యూహాలతో పార్టీని మళ్ళీ పైకి లేవనెత్తారు. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. 2023 లోపు తెలంగాణలో బలమైన పక్షంగా మారాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయత్నించడం, ఇటు పొరుగున ఉన్న రాష్ట్రంలోని పరిస్థితులు, అటు సొంత రాష్ట్రంలో నెమ్మదిగా పెరుగుతున్న వ్యతిరేకత – వీటన్నింటి నుండి కెసిఆర్ మరొకసారి బయటపడుతాడా, లేదంటే పదేళ్ల పాటు పాలించిన తర్వాత వ్యతిరేకత మూట గట్టుకొని పరాజయం పాలైన అనేక పార్టీల వలే అవుతాడా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా, గత ఐదేళ్ల తో పోలిస్తే రాబోయే నాలుగేళ్లలో పాలన అనేది కెసిఆర్ కి కత్తి మీద సాము వంటిది అని చెప్పవచ్చు.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com